మరో ఐదు రోజుల్లో పెండ్లి… కత్తితో గొంతు కోసుకొని యువ వ్యాపారవేత్త సూసైడ్​
1 min read

మరో ఐదు రోజుల్లో పెండ్లి… కత్తితో గొంతు కోసుకొని యువ వ్యాపారవేత్త సూసైడ్​

 

మరో ఐదు రోజుల్లో ఆ యువ వ్యాపారవేత్త ఇంట్లో పెండ్లి బాజాలు మోగనున్నాయి. అందరూ పెండ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎమైందో ఏమో కానీ పెండ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువ వ్యాపారవేత్త తాను నివాసం ఉంటున్న ఫ్లాట్​లో కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతున్నట్లు.. సూసైడ్​ చేసుకునే ముందు తన సోదరుడు, కాబోయే పెండ్లి కూతురు, మరో కుటుంబసభ్యుడికి మెయిల్​ చేశాడు. దీంతో యువకుడి కుటుంబం, యువతి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

కొండాపూర్​ మై హోం మంగళల ఏ బ్లాక్​లోని ఫ్లాట్​ నెంబర్​ 301లో నివాసం ఉండే ఎం. వెంకట కృష్ణ శ్రీసాయి(30) కొండాపూర్​లో హౌలరెట్​ యానిమేషన్​ కంపెనీ యజమాని. వెంకట కృష్ణకు ఫిబ్రవరి 22వ తేదిన ఓ యువతితో విశాఖపట్నంలోని ఓ హోటల్​లో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 12వ తేదిన వీరి పెండ్లి జరగాల్సి ఉంది. కుటుంబసభ్యులు అందరూ పెండ్లి పనుల్లో హడావుడిగా ఉన్నారు.

 

ఇంతలో ఏమైందో ఏమో కానీ.. మంగళవారం తన రూమ్మెట్ విజయ్​ బయటకు వెళ్లగా, మధ్యాహ్నం వెంకటకృష్ణ తన ఫ్లాట్​లో సూసైడ్​ చేసుకుంటున్నట్లు తన సోదరుడు సాయి పవన్​ కళ్యాణ్​, కాబోయే భార్య, మరో బంధువుకు మెయిల్​ పెట్టాడు. అనంతరం ఫ్లాట్​లోనే పెయిన్​ కిల్లర్​ టాబ్లెట్​ వేసుకొని కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెయిల్​ చూసిన సాయి పవన్​ కళ్యాణ్​ హుటాహుటిగా వెంకటకృష్ణ ఫ్లాట్​కు చేరుకున్నాడు.

 

ఎంతసేపు డోర్​ కొట్టిన తెరవకపోవడంతో రూమ్మెట్​ సహాయంతో డోర్​ను బద్దలుకొట్టాడు. అప్పటికే రక్తపుమడుగులో పడి ఉన్న వెంకటకృష్ణను వెంటనే సమీపంలోని ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

 

వెంకటకృష్ణ మరణంపై అనుమానాలు ఉన్నాయని సోదరుడు పవన్​కళ్యాణ్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు లేదా పెండ్లి గురించి మానసికంగా ఒత్తిడికి గురై వెంకటకృష్ణ సూసైడ్​ చేసుకొని ఉండొచ్చని గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు. మరో ఐదు రోజుల్లో పెండ్లి పీటలు ఎక్కాల్సిన వెంకటకృష్ణ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.