అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..రోడ్డు దాటుతున్న యువకులను కారుతో ఢీకొట్టిన పదహారేండ్ల బాలుడు
రోడ్డు దాటుతున్న యువకులను ఢీకొట్టిన కారు..
ఒకరు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..
మైనర్ కొడుక్కు కారు ఇచ్చిన తండ్రితో పాటు మైనర్ బాలుడిపై కేసు
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదహారేండ్ల బాలుడు తన మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి కారుతో వేగంగా దూసుకువచ్చి రోడ్డు దాటుతున్న ముగ్గురు యువకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడి చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ ఫ్లైఓవర్కింద ఈ నెల 1వ తేదిన అర్ధరాత్రి జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఏలా ఉన్నాయి.

వెస్ట్ బెంగాల్ రాష్ర్టం హుగ్లీ జిల్లాకు చెందిన సుదీప్తదాస్(26), సౌమెన్రాయ్(27), అభిజిత్ రాయ్(26), మరో వ్యక్తి సౌరవ్ సంత్ర(26) నగరానికి వలస వచ్చి రాయదుర్గం పోచమ్మబస్తీలో నివాసం ఉంటూ ఫీనిక్స్ కంపెనీలో లేబర్ పని చేస్తున్నారు. ఈ నెల 1వ తేదిన రాత్రి సుదీప్తదాస్, సౌమెన్రాయ్, అభిజిత్‌రాయ్ ముగ్గురు కలిసి తమ ఇయర్ఫోన్లను ఎక్చెంజ్ చేసుకోవడానికి సమీపంలోని ఓ ముబైల్షాప్కు వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి 11.50 గంటలకు తమ గదికి వెళ్తుండగా షేక్‌పేట్ ఫ్లైఓవర్ కింద రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో మెహిదిపట్నం నుండి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు(ఏపి31ఏవై1551) ఓ మైనర్ బాలుడు(16) అతి వేగంగా నడుపుతూ ముగ్గురిని ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడ్డ ముగ్గురిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సుదీప్తదాస్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. సౌమెన్రాయ్ తలకు తీవ్ర గాయాలవ్వడంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. మరో యువకుడు అభిజిత్‌రాయ్ కుడికాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు మైనర్ బాలురు ఉన్నట్లు రాయదుర్గం పోలీసులు గుర్తించారు. తన మైనర్ కుమారుడిని కారు ఇచ్చి ప్రమాదానికి కారణమైన బాలుడి తండ్రి గోల్కొండలోని సమతాకాలనీ 7 టుంబ్స్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇమాదుద్దీన్(48)పై మృతుడి రూమ్మెట్ సౌరవ్ సంత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. ప్రమాదానికి కారణమైన మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కారుపై రాంగ్ సైడ్ పార్కింగ్ వంటి ఆరు ట్రాఫిక్ చలాన్లు కూడా ఉన్నాయి.
