మియాపూర్ జీఎస్ఎం మాల్ వద్ద ఘోర ప్రమాదం..పేలిన బెలున్లు నింపే గ్యాస్ సిలిండర్..
సిలిండర్ తగలి తెగిపడిన వ్యక్తి కాలు పాదం..
మరో నలుగురికి గాయాలు..
శేరిలింగంపల్లి, వార్తమ్యాన్ : మియాపూర్ జాతీయ రహదారి వెంట ఉన్న జీఎస్ఎం మాల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. హీలియం గ్యాస్ సిలిండర్‌తో బెలూన్లు నింపుతుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో పక్కనే ఐస్‌క్రీం అముతున్న వ్యక్తి కాలు పాదం తెగిపడిపోయింది. ఈ ప్రమాదంతో స్థానికంగా భయానక వాతావరణం ఏర్పడింది. సిలిండర్ పేలిన ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవినాష్ జీఎస్ఎం మాల్ వద్ద సైకిల్‌పై హీలియం గ్యాస్ సిలిండర్ పెట్టుకుని బెలూన్లు విక్రయిస్తుంటాడు. శనివారం సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో బెలూన్లలో గ్యాస్ నింపుతుండగా సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలింది. పేలుడు దాటికి సిలిండర్ శకలాలు పక్కనే ఐస్‌క్రిమ్ విక్రయిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వివేక్పాల్ కుడికాలికి తగలడంతో కాలు పాదం తెగిపడిపోయి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ ఘటనతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది.

ఇదే సమయంలో జీఎస్ఎం మాల్‌కు స్కూటీపై వెళ్తున్న కొండాపూర్‌కు చెందిన ఎం. జనార్దన్ జీఎస్ఎం సిలిండర్ ముక్కలు తగిలి కాలుకి గాయాలయ్యాయి. కాలేజి నుండి ఇంటికి వెళ్తున్న ధనుష అనే విద్యార్ధినికి స్వల్ప గాయాలయ్యాయి. షాపింగ్ కోసం మాల్‌కు వచ్చిన విన్నకొండ సింధూప్రియ కారులో కూర్చున్న సమయంలో పేలుడు ధాటికి కారు అద్దాలు పగిలి ఆమెకు గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచార అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ వివేక్పాల్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారందరికి చికిత్స కోసం మియాపూర్ పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బెలూన్లు విక్రయిస్తున్న అవినాష్ చేతికి గాయాలైనట్లు మియాపూర్ ఇన్స్పెక్టర్ జయరాం తెలిపారు. ఘటన అనంతరం అతడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
