ప్రభుత్వ స్థలంలో.. ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్
గంగారం బస్తీ దవాఖానలో ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్..
దవాఖానకు వచ్చే రోగులకు పొంచి ఉన్న ప్రమాదం..
వైద్యాధికారులు, విద్యుత్ శాఖ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు..
అదో బస్తీ దవాఖాన.. చుట్టూ ఉన్న పేద ప్రజలు తమకు సుస్తి చేస్తే వైద్య సేవలకు అక్కడి వస్తారు. బాలింతలు తమ శిశువులకు టీకాలు వేపించడానికి ఈ దవాఖానకే వస్తారు. దవాఖాన వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా దవాఖానకు వచ్చే రోగులు, బాలింతలు, చిన్నారుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.
చందానగర్ గంగారం బస్తీలోని బస్తీ దవాఖానకు చెందిన స్థలంలో ఓ ప్రైవేటు నిర్మాణదారుడి కోసం విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తి కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంపై స్థానికుల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం..

చందానగర్ గంగారం గ్రామంలో బస్తీ దవాఖాన ఉంది. ప్రతి బుధ, శనివారాల్లో నెలసూదులు, టీకాల కోసం పెద్ద సంఖ్యలో బాలింతలు తమ శిశువులను తీసుకొని తలిదండ్రులు చిన్నారులతో కలిసి ఈ బస్తీ దవాఖానకు వస్తుంటారు. దవాఖాన ఆవరణలోనే ఓ ప్రైవేటు వ్యక్తి కోసం ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తుండడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే బస్తీ దవాఖానకు వచ్చే రోగులకు, చిన్నారులు, వారి తల్లిదండ్రుల ప్రాణాలకు ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంది. ఈ వ్యవహారంపై సంబంధిత వైద్యాధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం, ఆస్పత్రి ఆవరణలో పనులు జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ప్రభుత్వ భూమిలో..అందులో ఆసుపత్రి ఆవరణలో.. ప్రైవేట్ అవసరాల కోసం ట్రాన్స్ఫార్మర్ను బిగించడం కోసం ఎవరు అనుమతి ఇచ్చారు? ఆసుపత్రి భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందే ప్రభుత్వ దవాఖానల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

బస్తీ దవాఖానలో ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంపై ఇటూ విద్యుత్ శాఖ, అటూ వైద్యాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయిస్తున్నారా అనే ప్రశ్నలు ఏర్పడుతున్నాయి
గంగారం బస్తీ దవాఖానలో ఏర్పాటు చేస్తున్న ఈ ట్రాన్స్ఫార్మర్పై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తక్షణమే తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
