మాదాపూర్​లో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య..
1 min read

మాదాపూర్​లో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య..

 

తన ఇద్దరు కుమార్తెలను వేధించిన యువకుడిని హత్య చేసిన తండ్రి, మేనమామా

 

కత్తితో పొడిచి. .. కర్రలతో కొట్టి దారుణ హత్య..

 

హత్య అనంతరం పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయిన ఇద్దరు నిందితులు..

 

మరో ముగ్గురి కోసం గాలింపు..

 

తన ఇద్దరు కుమార్తెలను వేధిస్తున్నాడని ఓ యువకుడిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఓ తండ్రి తన బావమరిది, మరో ముగ్గురితో కలిసి యువకుడిని కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటన మాదాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి  జరిగింది. హత్య జరిగిన అనంతరం నిందితులు ఇద్దరు మాదాపూర్​ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

 

వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సినపల్లి రాములు సోమక్క దంపతుల కుమారుడు భాస్కర్​(32)  ఇంటర్​ వరకు చదువుకొని 8 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. మొదట గచ్చిబౌలలోని ఐఐఐటీ క్యాంటీన్​లో కుక్​గా పనిచేశాడు. రెండు సంవత్సరాల క్రితం మాదాపూర్​ రామేశ్వర్​ కేఫ్​ వెనుకాల ఉన్న శ్రీ శ్రీ సూట్స్​ అనే హోటల్​లో చెఫ్​గా పనిచేస్తున్నాడు.

 

ఇదే గ్రామానికి చెందిన తమ్మడబోయిన రాజు అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజు పెద్ద కుమార్తెకు అదే  గ్రామానికే చెందిన భాస్కర్​తో 2020 లో పరిచయం ఏర్పడింది.  ఇద్దరు చాటింగ్​, ఫోన్​ కాల్స్​ మాట్లాడుకుంటూ సన్నిహితంగా  ఉన్నారు. విషయం తెలిసిన యువతి తండ్రి రాజు పెద్ద కుమార్తె జోలికి రావొద్దని రెండు మూడు సార్లు వార్నింగ్​ కూడా ఇచ్చాడు.

 

అయినా భాస్కర్​ తీరు మారకపోవడంతో వరంగల్​ జిల్లా పర్వతగిరి పోలీస్​ స్టేషన్​, వర్ధన్నపేట పోలీస్​ స్టేషన్​లలో భాస్కర్​పై ఫిర్యాదులు చేశాడు. వేధింపులు తీవ్రం కావడంతో తన కుమార్తెను భాస్కర్​ వేధిస్తున్నాడని 2021లో హన్మకొండలో షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కౌన్సిలింగ్​ ఇచ్చి పంపించారు.

 

2023 మే నెలలో రాజు తన పెద్ద కుమార్తెను ఖాజిపేట్​కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. వివాహం జరిగిన తర్వాత భాస్కర్ ఆ​ యువతితో మెసేజ్​లు చేసి.. వాటి స్ర్కీన్​ షాట్​లను అమె భర్తకు పంపించాడు. ఈ విషయంపై భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. యువతి భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చేసింది. గత నెల భార్యభర్తలు విడాకులు తీసుకున్నారు.

 

మూడు నెలల క్రితమే రాజు పెద్ద కుమార్తె యూపిఎస్సీ ప్రిపరేషన్స్​ కోసం హైదరాబాద్​ బేగంపేటలోని ప్రకాశ్​నగర్​లో నివాసం ఉంటున్న చిన్న కుమార్తె వద్దకు వచ్చింది. కాగా.. ఇటీవల రాజు చిన్న కుమార్తెకు భాస్కర్​ ఫోన్​లో తన అక్క గురించి అసభ్యకరంగా మెసేజ్​లు పెట్టాడు. అంతటితో ఆగకుండా చిన్న కుమార్తె పేరుతో ఇన్​స్ర్టాగ్రామ్​లో ఫేక్​ ఐడీ క్రియేట్​ చేసి మార్ఫింగ్​ ఫోటోలు పెట్టి వేధించసాగాడు. ఈ వేధింపులు భరించలేక చిన్న కుమార్తె జరిగిన విషయం తన తండ్రికి చెప్పింది.

 

పెండ్లి చేసిన పెద్ద కుమార్తెను వేధించి, అమె భర్త విడాకులు ఇవ్వడం.. చిన్న కుమార్తెను కూడా వేధింపులకు గురిచేయడంతో భాస్కర్​పై యువతి తండ్రి రాజు తీవ్ర కక్ష్య పెంచుకున్నాడు. భాస్కర్​ను హత్య చేస్తేనే తన ఇద్దరు కుమార్తెలు ప్రశాంతంగా ఉంటారు అని నిర్ణయించుకున్నాడు. భాస్కర్​ పనిచేసే ప్రదేశం తెలుసుకున్న రాజు మంగళవారం తన బావమరిది మరో ముగ్గురితో కలిసి కారులో వరంగల్​ నుండి మాదాపూర్​కు చేరుకున్నారు. అర్ధరాత్రి 11 గంటలకు భాస్కర్​ పనిచేస్తున్న శ్రీశ్రీ సూట్స్​ హోటల్​ వద్దకు చేరుకున్నారు.

 

రాజు తన బావమరిది కుమారస్వామి కలిసి తమ అనుచరులను హోటల్​ లోపలికి పంపించి మాట్లాడేది ఉందని చెప్పి భాస్కర్​ను బయటకు రప్పించారు. రాత్రి 11.30 గంటలకు హోటల్​ నుండి భాస్కర్​ బయటకు రాగానే రాజు తన బావమరిది మరో ముగ్గురు అనుచరులతో కలిసి వెంట తెచ్చుకున్న చిన్న కత్తితో భాస్కర్​ను పొడిచారు. అనంతరం వెంట తెచ్చుకున్న కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలై భాస్కర్​ అపస్మారకస్థితికి చేరుకున్నాడు.

 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మాదాపూర్​ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ భాస్కర్​ను కొండాపూర్​లోని జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. మృతుడి సోదరుడు మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్​ ఇన్​స్పెక్టర్​ నిందితులపై ఎస్సీఎస్టీ, హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజు, అతని బావమరిది కుమారస్వామి హత్య అనంతరం మాదాపూర్​ పోలీసుల ఎదుట లొంగిపోగా, మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.