మియాపూర్​లో పెండ్లైన 40 రోజులకే నవ వధువు సూసైడ్​
1 min read

మియాపూర్​లో పెండ్లైన 40 రోజులకే నవ వధువు సూసైడ్​

 

అదనపు కట్నం తేవాలని భర్త వేధింపులు..

వేధింపులు భరించలేక ఫ్యాన్​కు ఉరివేసుకొని సూసైడ్​ చేసుకున్న భార్య

 

వారిద్దరికి  ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. పెండ్లి జరిగిన 40 రోజులకే భర్త అదనపుకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక ఆ సాఫ్ట్​వేర్​ నవ వధువు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మియాపూర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది.

 

బీహార్​ రాష్ర్టానికి చెందిన ఇషికయాదవ్​, మధ్యప్రదేశ్​ రాష్ర్టానికి చెందిన నీరజ్​బన్సల్​ ఇద్దరికి 2020 సంవత్సరంలో ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ కలిసి పెద్దలను ఒప్పించి 2026 ఫిబ్రవరి నెల 20వ తేదిన వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం భార్యభర్తలు మియాపూర్​ మక్త మహబూబ్​పేట్​లోని ఓఅపార్ట్​మెంట్​లో నివాసం ఉంటూ హైటెక్​సిటీలో ఓ కంపెనీలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగాలు చేస్తున్నారు.

 

గతకొద్ది రోజులుగా నీరజ్​ బన్సల్​ అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్య ఇషిక యాదవ్​ను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు భరించలేక ఇషిక మంగళవారం రాత్రి తన నివాసంలోనే హాల్​లో ఫ్యాన్​కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం నీరజ్​ నిద్రలేచి చూసేసరికి హాల్లో ఇషిక ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న మియాపూర్​ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని భర్తను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.