నిర్మాణ రంగ కార్మికుల భద్రతకు పెద్ద పీట.. సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్
1 min read

నిర్మాణ రంగ కార్మికుల భద్రతకు పెద్ద పీట.. సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్

నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ, వారి రక్షణే లక్ష్యం అని సైబరాబాద్​ సీపీ డా. ఎం. రమేష్​ తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, భద్రత, భీమాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో లేబర్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, ప్రావిడెంట్ ఫండ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, కార్మికుల చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాలు, ఇన్సూరెన్స్ ప్రయోజనాలపై మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో కొల్లూరు, నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాలకు చెందిన నిర్మాణ కార్మికుల ప్రతినిధి లు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ..  లేబర్ క్యాంపుల్లో స్పష్టమైన నిబంధనలు, భద్రత చర్యలు కచ్చితంగా అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాలు కార్మికులకు అందేలా సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేయాలని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల విషయంలో, ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తింపులో ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

 

గంజాయి వంటి మాదకద్రవ్యాలపై లేబర్ క్యాంపుల్లో తరచూ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు లేదా కేసులు జరిగినప్పుడు బాధితులతో సానుభూతితో వ్యవహరించాలని, దూర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులకు కనీస వసతి సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సూచించారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, ప్రమాద బీమా, ఆరోగ్య పరీక్షా శిబిరాలు నిర్వహించి వారి సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు

పిఎఫ్ ప్రాంతీయ కమిషనర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ..  ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ఈపిఎఫ్​ అండ్​ ఎంపి చట్టం అమలు ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ చట్టం నిర్దిష్ట సంఖ్యకు పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకు వర్తిస్తుందని, ఒకసారి అమల్లోకి వచ్చిన తరువాత ఉద్యోగుల సంఖ్య తగ్గినా కూడా కొనసాగుతుందని వివరించారు. నిర్దిష్ట వేతన పరిమితి వరకు ఉన్న ఉద్యోగులకు పీఎఫ్ సభ్యత్వం తప్పనిసరి అని, ఉద్యోగి అంటే సంస్థలో వేతనం కోసం పనిచేసే ప్రతి వ్యక్తి అని పేర్కొన్నారు.

 

ఈ చట్టం కింద ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ పథకాల ద్వారా ఉద్యోగులకు భవిష్యత్‌లో ఆర్థిక భద్రత కల్పించబడుతుందని చెప్పారు. అలాగే ప్రత్యేక పథకాల ద్వారా గతంలో నమోదు కాని ఉద్యోగులను స్వచ్ఛందంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రోత్సాహకాలు అందించే పథకాలు కూడా అమల్లో ఉన్నాయని, వాటి ద్వారా ఉద్యోగులకు ఆర్థిక సహాయం లభిస్తుందని పేర్కొన్నారు. సంస్థలు ఉద్యోగుల వివరాలను సక్రమంగా నమోదు చేసి, సమయానికి చెల్లింపులు చేయడంతో పాటు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

శేరిలింగంపల్లి డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం, భద్రత, చట్టపరమైన నిబంధనల అమలుపై పలు కీలక సూచనలు చేశారు. కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించడం.. ఆరోగ్య, భద్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించడం అత్యవసరమని పేర్కొన్నారు. కార్మికుల జీతాలు సమయానికి చెల్లించడం, కనీస వేతనాలు అమలు చేయడం, ఇన్సూరెన్స్ సదుపాయాలు అందుబాటులో ఉంచడం ద్వారా ప్రమాదాల సమయంలో వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్మిక చట్టాలను పూర్తిగా అమలు చేసి, ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు.

 

పరిశ్రమలు, లేబర్ క్యాంపుల్లో సీసీ కెమెరాలు, యాక్సెస్ కంట్రోల్ వంటి భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, కార్మికులకు సేఫ్టీ ట్రైనింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. అదనంగా, లేబర్ క్యాంపుల్లో తగిన లైటింగ్ ఏర్పాటు చేయడం, ప్రతి కార్మికుడి పూర్తి వివరాలను నమోదు చేసి భద్రపరచడం అవసరమని పేర్కొన్నారు. కార్మికులు పనికి వెళ్లే సమయంలో వారి పిల్లల కోసం స్టడీ సౌకర్యాలు కల్పించి, అవసరమైన మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. లేబర్ క్యాంపుల్లో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు బాధ్యతాయుతంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ..  పనిచేసే ప్రదేశాల్లో కార్మికుల హక్కులు, వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల పూర్తి వివరాలు సేకరించి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్మికులకు కనీస వేతనాలు తప్పనిసరిగా చెల్లించడంతో పాటు, అదనపు పని చేస్తే ఓవర్‌టైం వేతనం ఇవ్వాలని చెప్పారు.

 

ప్రతి కార్మికుడి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేసి, ప్రమాదాలు జరిగినప్పుడు వారికి సహాయం అందేలా చూడాలని తెలిపారు. కార్మికుల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని.. రెగ్యులర్, తాత్కాలిక కార్మికుల వివరాలు కూడా తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. ఈ నియమాలు పాటించని యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు వెంటనే సహాయం అందేలా బాధ్యతగా వ్యవహరించాలని ఆయన తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి అడిషనల్ డీసీపీ ఎం. ఉదయ్ రెడ్డి, ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ దుర్గాప్రసాద్, పీఎఫ్ కమిషనర్ మనోజ్ కుమార్, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ శ్యామ్ సుందర్ రెడ్డి, సిఎంసి డిప్యూటీ కమిషనర్లు కృష్ణమోహన్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.