రాజు వెడ్స్ రాంబాయి హిరోపై దాడికి యత్నించిన ఫుడ్ డెలివరీ బాయ్స్..
ఫుడ్ డెలివరీ విషయంలో డెలివరీ బాయ్‌తో గొడవ పడ్డ హిరో అఖిల్ రాజ్
వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన డెలివరీ బాయ్..
కుటుంబంతో కారులో గుడికి వెళ్తుండగా రాళ్లతో దాడికి యత్నించిన డెలివరీ బాయ్స్..
పోలీసులకు ఫిర్యాదు చేసిన.. హిరో.. నలుగురిపై కేసు నమోదు..

ఫుడ్ డెలివరీ విషయంలో డెలివరీ బాయ్… రాజు వెడ్స్ రాంబాయి హిరో మధ్య తలెత్తిన వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎదురు ఇంట్లో ఇవ్వాల్సిన నాన్‌వెజ్ డెలివరీ ఐటమ్‌ను తన ఇంట్లో ఇవ్వడంపై మొదలైన గొడవ.. హిరో అఖిల్ రాజ్ ప్రయాణిస్తున్న కారుపై డెలివరీ బాయ్స్ దాడికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది.
కొండాపూర్ శ్రీరాంనగర్‌కాలనీలో ఇంటి నెం. 201 అరుణ రెసిడెన్షీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా హిరో అఖిల్‌రాజ్ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి ఎదురుగా ఇంటి నెం.201లో చేలం రెసిడెన్షీ ఉంటుంది.
అయితే ఈ నెల 28వ తేదిన మధ్యాహ్నం మీట్ఈగో అనే యాప్ నుండి బుక్ అయినా నాన్‌వెజ్ ఐటమ్‌ను ఇంటి నెంబర్ 201లోని చేలం రెసిడెన్షీలో ఇవ్వాల్సిన డెలివరీని ఎదురుగా ఉన్న అఖిల్ రాజ్ ఇంట్లో డెలివరీ ఇచ్చాడు. దీనిపై అఖిల్ రాజ్ డెలివరీ బాయ్ రమేష్ మధ్య గొడవ జరిగింది.
ఈ గొడవకు సంబంధించిన వీడియోను డెలివరీ బాయ్ రమేష్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో తన ప్రతిష్టకు బంగం కలిగించడం, తన కుటుంబంతో డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడని అదే రోజు అఖిల్ రాజ్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డెలివరీ బాయ్ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు హిరో అఖిల్ రాజ్‌పై మండిపడ్డారు. సోషల్ మీడియాలో హిరో వైఖరిపై కామెంట్లు పోస్టు చేశారు. వీటిపై స్పందించిన అఖిల్ రాజ్ జరిగిన సంఘటనపై సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేశాడు.
ఈ క్రమంలో మంగళవారం అఖిల్ రాజ్ తన తల్లిదండ్రులతో కలిసి ఇంటి నుండి కారులో గుడికి వెళ్తుండగా.. ఇంటి సమీపంలో ఒక్కసారిగా డెలివరీ బాయ్స్ అందరూ రాళ్లతో చేతులతో దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దాడికి యత్నించిన రమేష్, అతని స్నేహితుడు సందీప్‌తో పాటు మరో నలుగురు డెలివరీ బాయ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. అఖిల్ రాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
