సైబరాబాద్‌లో ప్రయోగాత్మకంగా సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్
22 కిలోమీటర్ల దూరం.. క్లీన్ స్వీప్ డ్రైవ్..
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కమిషనర్ సృజన
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన. ఈ కార్యక్రమంలో ఒక రూట్ సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాల్లో క్లీన్ స్వీప్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం పటాన్చెరు నుండి బీహెచ్ఈఎల్, గచ్చిబౌలి, ఖాజగూడ, లాంకోహిల్స్ మీదుగా మణికొండ వరకు 22 కిలోమీటర్లు ఈ డ్రైవ్ సాగింది. ఈ క్లీన్ స్వీప్ డ్రైవ్ విజయవంతం కావడంతో శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని శేరిలింగంపల్లి జోనల్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడేతో కలిసి సిఎంసి కమిషనర్ సృజన వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..సైబరాబాద్ కమిషనరేట్‌ను క్లీన్‌గా ఉంచేందుకు సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ పేరిట ప్రయోగాత్మకంగా ప్రారంభించామన్నారు. ఈ డ్రైవ్‌ను ప్రతి శనివారం లేదా అదివారం నిర్వహిస్తామన్నారు. సైబరాబాద్‌లో అత్యధికంగా ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులు ఉన్న నేపథ్యంలో ఈ డ్రైవ్‌లో ఐటీ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చేసుకొని ముందుకు వెళ్తామన్నారు. శనివారం ఉదయం 6 గంటలకు పటాన్చెరులో ప్రారంభించిన ఈ డ్రైవ్ మణికొండ వరకు 22కిలోమీటర్లు కొనసాగింది. 44 పార్టులుగా 500 మీటర్ల చొప్పున విభజించామన్నారు.
ఈ డ్రైవ్‌లో 128 అధికారులు, 750 మంది సిబ్బంది పాల్గొన్నారు. 22 కిలోమీటర్ల దూరంలో రోడ్ల వెంట ఉన్న చెత్త, పేరుకుపోయిన ఇసుక, సీ ఆండ్ డి వెస్ట్, చెట్ల కొమ్మలు, ఫుట్‌పాత్‌ల అక్రమణలు, విద్యుత్ దీపాలు, తెగిపోయిన కేబుల్ వైర్లు తొలగించడంతో పాటు సరిచేయడం జరిగిందన్నారు. దాదాపు 1000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించామన్నారు. కమిషనరేట్ పరిధిలో నిర్మాణ వ్యర్థాలను డంప్ చేయడం తప్పయితే, ఆ వ్యర్థాలను తొలగించకపోయిన అధికారులది తప్పేనని తెలిపారు. ప్రజలు ఇవ్వరూ రోడ్లపై చెత్తను వేయవద్దని, తమ ఇంటి వద్దకు వచ్చే స్వచ్ఛ ఆటోలోనే చెత్తను వేయాలన్నారు.
తాము చేపట్టిన ఈ క్లీన్ స్వీప్ డ్రైవ్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. రోడ్లపై ఇష్టానుసారంగా చెత్త వేసిన వ్యక్తులకు వ్యాపార సముదాయాలకు రూ. 11 లక్షల పెనాల్టీలు విధించామన్నారు. త్వరలోనే చెత్తను తరలించే ఆటోలను ఈవీగా మార్చునున్నట్లు తెలిపారు. వచ్చే వర్షకాలం నాటికి సైబరాబాద్‌లో 15 లక్షల మొక్కలను నాటుతామని అన్నారు. వర్షకాలం వచ్చేలోపు నాలాలో పూడికతీతను పూర్తి చేస్తామన్నారు.
సైబరాబాద్‌లో మొత్తం 312 చెరువులు ఉంటే అందులో 261 చెరువుల్లో గుర్రపుడెక్క ఉందన్నారు. గుర్రపుడెక్క తొలగించేందుకు టెండర్లు పిలిచామని, వర్షకాలం ప్రారంభమయ్యే లోపు చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగిస్తామన్నారు. సైబరాబాద్‌ను అన్నీ రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిఎంసి అధికారులు పాల్గొన్నారు.
