ఇజ్రాయిల్​లో ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను ఈజిప్టులో వదిలేసిన కన్సల్టెన్సీ
1 min read

ఇజ్రాయిల్​లో ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను ఈజిప్టులో వదిలేసిన కన్సల్టెన్సీ

 

  • డబ్బులు వసూళు చేసి బోర్డు తిప్పేసిన సిడి ఓవర్సీస్​ కన్సల్టెన్సీ

 

  • ఒక్కొక్కరి వద్ద రూ. 8లక్షల వరకు వసూళు..

 

  • ఆరు నెలల పాటు దేశం కానీ దేశంలో అష్టకష్టాలు..

 

  • అప్పులు చేసి తిరిగి ఇండియాకు వచ్చిన నిరుద్యోగులు..

 

  • విదేశాల్లో ఉద్యోగాల కోసం అప్పులు చేసి, బంగారం కుదవ పెట్టిన నిరుద్యోగులు

 

శేరిలింగంపల్లి, వార్తమ్యాన్​ : ఇజ్రాయిల్​ దేశంలో ఉద్యోగాలు.. లక్షల్లో జీతాలు ఇస్తారు అని చెప్పి నిరుద్యోగులను ఓ కన్సల్టెన్సీ నిండా ముంచేసింది. ఉద్యోగాల కోసం ఒక్కో నిరుద్యోగి నుండి రూ. 8 లక్షల వరకు వసూళు చేసిన కన్సల్టెన్సీ ఇజ్రాయిల్లో ప్రాసెస్​ ఎక్కువ ఉంటుందని, అందరిని ఈజిప్టు దేశానికి తీసుకువెళ్లి అక్కడే వదిలేసింది.

 

ఉద్యోగాలు వస్తాయని ఆరు నెలల పాటు ఈజిప్టులో వేచిఉన్న నిరుద్యోగులకు సదరు కన్సల్టెన్సీ చివరకు మొండిచెయ్యి చూపెట్టడంతో.. మోసపోయినట్లు గుర్తించి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు అప్పులు చేసి తిరిగి ఇండియాకు వచ్చారు. మోసపోయిన నిరుద్యోగులు అందరూ సదరు కన్సల్టెన్సీ అఫీస్​ వద్దకు వెళ్తే అప్పటికే బిచానా ఎత్తేశారు. ఈ సంఘటన హైదరాబాద్​లోని హఫీజ్​పేట్​లో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

కన్సల్టెన్సీ నిర్వాహకులు

 

ఇజ్రాయిల్​లో ఉద్యోగాలు అని చెప్పి ఈజిప్టుకు తీసుకుపోయిండ్రు..

 

నిజామాబాద్​కు చెందిన విజయ్​​ స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోషల్​ మీడియాలో సిడి ఓవర్సీస్​ అనే కన్సల్టెన్సీ కంపెనీ ద్వారా ఇజ్రాయిల్​ దేశంలో వేర్​హౌజ్​లో సూపర్​వైజర్​ ఉద్యోగాలు లక్షల్లో జీతం అంటూ ప్రకటనలు చూసిన విజయ్​​ హఫీజ్​పేట్​ రోడ్డు నెం. 10ఏలో ఉన్న సిడి ఓవర్సీస్​ కన్సల్టెన్సీని సంప్రదించాడు. ఇజ్రాయిల్​ దేశంలో తమకు తెలిసిన వారు ఉన్నారని, అక్కడి వేర్​హౌజ్​లో సూపర్​వైజర్​ ఉద్యోగాలు ఇప్పిస్తామని జీతం రూ. 1,80,000 నుండి రూ. 2లక్షల వరకు వస్తుందని చెప్పడంతో విజయ్​​ నమ్మాడు.

 

ఇండియా నుండి ఇజ్రాయిల్​ డైరెక్ట్​ ప్రాసెస్​ అవ్వడం లేదని, ఈజిప్టు దేశానికి వెళ్తే అక్కడి నుండి తొందరగా ఇజ్రాయిల్​ వెళ్లిపోవచ్చని కన్సల్టెన్సీ నిర్వాహకులు అర్చన ప్రియ, స్వామి శంకర్​ పేర్కొన్నారు. ఇందుకోసం మొత్తం రూ. 8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో అందుకు విజయ్​​ ఒప్పుకున్నాడు. మొదటి విడుతగా రూ. 4లక్షలు అన్​లైన్​ ద్వారా చెల్లించాడు. ఆ తర్వాత కన్సల్టెన్సీ నిర్వాహకులు ఈజిప్టు టూరిస్టు వీసా ఇవ్వడంతో విజయ్​​ సొంత పైసలతోనే ఈజిప్టులోని కైరో ఎయిర్​పోర్టుకు వెళ్లాడు.

 

అక్కడ సోమ శేఖర్​ అనే వ్యక్తి రిసీవ్​ చేసుకొని రూమ్​ చూపెట్టాడు. జాబ్​ ప్రాసెస్​తో ఉందని, అంత వరకు రూమ్​లో ఉండాలని విజయ్​కు సూచించాడు. విజయ్​​తో పాటు హైదరాబాద్​ నుండి బ్యాచ్​ల వారిగా సిడి ఓవర్సీస్​ కన్సల్టెన్సీ ద్వారా 40 మంది వరకు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఈజిప్టు వెళ్లారు.

 

నిరుద్యోగల నుండి వసూళు చేసిన డబ్బును లెక్కిస్తున్న నిర్వాహకురాలు అర్చన ప్రియ

 

ఇరాన్​ వార్​ పేరుతో ఆరు నెలల ఈజిప్టులోనే…

 

ఇజ్రాయిల్​ ఎంప్లాయిమెంట్​ విసా ప్రాసెస్​ జరుగుతుందని చెబుతూ దాదాపు రెండు నెలల పాటు గడువు పెంచుకుంటూ వచ్చారు. కొద్ది రోజులు ఇరాన్​ వార్​తో లేట్​ అవుతుందని పేర్కొన్నారు. ఆరు నెలల పాటు ఉద్యోగాలు ప్రాసెస్​లో ఉన్నాయని చెబుతుండడంతో విజయ్​​తో ఇతరులు సోమ శేఖర్​ను నిలదీశారు. దీంతో సోమశేఖర్​ కన్సల్టెన్సీ నుండి వాట్సప్​ మెసేజ్​ ద్వారా అందరికి లాయర్​ నోటీసు పంపించారు.మీకు కన్సల్టెన్సీ సంబంధం లేదని అందులోని సారాంశం.

 

మీకు ఉద్యోగాలు లేవు అంటూ సోమశేఖర్​ బెదిరింపులకు దిగాడు. తమ డబ్బులు ఇచ్చేలాయని విజయ్​​తో పాటు మరికొంత మంది యువకులు డిమాండ్​ చేయగా.. మీరు ఇచ్చిన డబ్బులు జాబ్​ ప్రాసెస్​కు ఖర్చు అయ్యిందని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు అందరూ కలిసి ఈజిప్టు కైరోలోని ఇండియా ఎంబసీని ఆశ్రయించారు. ఎంబసీ అధికారులు తాము ఏలాంటి చర్యలు తీసుకోలేమని, మీరు ఇండియాకు వెళ్లి అక్కడి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

 

అప్పు చేసి హైదరాబాద్​కు తిరిగి వచ్చిండ్రు..

 

విజయ్​​తో పాటు ఉద్యోగాల కోసం ఈజిప్టు వెళ్లిన పలువురు యువకులు తమతో పాటు తీసుకు వెళ్లిన డబ్బు మొత్తం అక్కడ తిండి, గది రెంట్​ కోసం ఖర్చు పెట్టారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో మోసపోయిన వారందరూ తిరిగి ఇండియాకు వచ్చేందుకు డబ్బులు లేక తెలిసిన వారి వద్ద అప్పు చేసి తిరిగి ఇండియాకు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న తర్వాత అందరూ కలిసి హఫీజ్​పేట్​లోని సిడి ఓవర్సీస్​ కన్సల్టెన్సీఅఫీస్​ వద్దకు వెళితే అక్కడ అఫీస్​ మూసేసారు.

 

దీంతో విజయ్​​తో పాటు మరికొందరూ యువకులు సోమవారం మియాపూర్​ పోలీస్​ స్టేషన్​కు చేరుకొని కన్సల్టెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం నుండి బాధితులు పోలీస్​ స్టేషన్​కు క్యూ కట్టారు. ఈ మేరకు మియాపూర్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 

విదేశాల్లో ఉద్యోగాల కోసం బంగారం కుదవ పెట్టి, అప్పులు చేసిండ్రు..

 

ఇజ్రాయిల్​ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సిడి కన్సల్టెన్సీ 40 మంది వద్ద డబ్బులు వసూళు చేసి చీటింగ్​ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కోక్కరి వద్ద నుండి రూ. 4 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు వసూళు చేసినట్లు తెలుసుకున్నారు. దాదాపు 100 మంది వరకు బాధితులు ఉద్యోగాల కోసం డబ్బులు కట్టినట్లు తెలిసింది.

 

విదేశాల్లో ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు వస్తాయని నమ్మిన బాధితులు బంగారం కుదవ పెట్టి, అప్పులు చేసి మరి డబ్బులు కట్టారు. కొందరూ ఇంట్లో తెలియకుండా ఉద్యోగాల కోసం డబ్బులు కట్టారు. ఉద్యోగాల కోసం డబ్బులు కట్టి మోసపోయిన నిరుద్యోగులందరూ కన్సల్టెన్సీపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.