ఐటీ కారిడార్‌లో రూ.1200 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
ఐటీ కారిడార్‌లో హైడ్రా భారీ ఆపరేషన్..
8 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్
హైటెక్‌సిటీలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్‌లోని సర్వే నంబర్ 55లోని బడా రియల్ ఎస్టేట్ సంస్థల స్వాధీనంలో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు.. కొలను మాధవరెడ్డి కూతురు సబితకు చెందిన 4 ఎకరాల భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్డులను హైడ్రా తొలగించింది.
ప్రభుత్వ భూమిలో నెలకొల్పిన ఆర్సీసీ ప్లాంట్‌ను వాసవి నిర్మాణ సంస్థ స్వయంగా తొలగించుకుంది. కార్మికులకోసం వేసిన తాత్కాలిక షెడ్డులను హైడ్రా తొలగించింది. మొత్తం 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను హైడ్రా తొలగించి బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.1200ల కోట్లకు పైగా ఉంటుందని హైడ్రా పేర్కొంది. గతంలోనూ ఇక్కడ ఆక్రమణలను హైడ్రా తొలగించింది. సర్వే నంబరు 53లోని మొండికుంట ఆక్రమణలతో పాటు.. సర్వే నంబరు 55లోని ప్రభుత్వ భూమిని 11 ఎకరాల వరకూ స్వాధీనం చేసుకుంది.

అసైన్డ్ భూముల పేరుతో అక్రమణలు..
శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్‌లోని సర్వే నంబర్ 55 లో ఉన్న భూమి అసైన్డ్ ల్యాండ్‌ను రంగారెడ్డి కలెక్టర్ ప్రోహిబిటెడ్ లిస్టులో పెట్టారు. అదే భూమిని తమదిగా మీనాక్షి రియల్ ఎస్టేట్ సంస్థ చెబుతుండగా, వాసవి నిర్మాణ సంస్థ అందులో ఆర్సీసీ ప్లాంటులతో పాటు.. భవన నిర్మాణ కార్మికులకు షెడ్డులు నిర్మించి, నిర్మాణ సామగ్రిని కూడా అందులో ఉంచింది. ఇలా వినియోగించుకుంటూ మొత్తం 4.20 ఎకరాల భూమిని తన స్వాధీనంలో ఉంచుకుంది.
ఈ రెండు సంస్థలకు తోడు ఇదే సర్వే నంబరులో ఉన్న మరో 4 ఎకరాల భూమిని కొలను మాధవరెడ్డి కుమార్తె కొలను సబిత తనదిగా చెబుతూ బౌన్సర్లను కాపలాగా ఉంచారు. హైడ్రాకు ఫిర్యాదు అందడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలమేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అదికారులతో కలిసి హైడ్రా విచారించింది. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. మొత్తం 8 ఎకరాలకు పైగా ఉన్న భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేశారు. అలాగే ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.
