మరో ఐదు రోజుల్లో పెండ్లి… కత్తితో గొంతు కోసుకొని యువ వ్యాపారవేత్త సూసైడ్
మరో ఐదు రోజుల్లో ఆ యువ వ్యాపారవేత్త ఇంట్లో పెండ్లి బాజాలు మోగనున్నాయి. అందరూ పెండ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎమైందో ఏమో కానీ పెండ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువ వ్యాపారవేత్త తాను నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతున్నట్లు.. సూసైడ్ చేసుకునే ముందు తన సోదరుడు, కాబోయే పెండ్లి కూతురు, మరో కుటుంబసభ్యుడికి మెయిల్ చేశాడు. దీంతో యువకుడి కుటుంబం, యువతి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
కొండాపూర్ మై హోం మంగళల ఏ బ్లాక్‌లోని ఫ్లాట్ నెంబర్ 301లో నివాసం ఉండే ఎం. వెంకట కృష్ణ శ్రీసాయి(30) కొండాపూర్‌లో హౌలరెట్ యానిమేషన్ కంపెనీ యజమాని. వెంకట కృష్ణకు ఫిబ్రవరి 22వ తేదిన ఓ యువతితో విశాఖపట్నంలోని ఓ హోటల్లో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 12వ తేదిన వీరి పెండ్లి జరగాల్సి ఉంది. కుటుంబసభ్యులు అందరూ పెండ్లి పనుల్లో హడావుడిగా ఉన్నారు.
ఇంతలో ఏమైందో ఏమో కానీ.. మంగళవారం తన రూమ్మెట్ విజయ్ బయటకు వెళ్లగా, మధ్యాహ్నం వెంకటకృష్ణ తన ఫ్లాట్‌లో సూసైడ్ చేసుకుంటున్నట్లు తన సోదరుడు సాయి పవన్ కళ్యాణ్, కాబోయే భార్య, మరో బంధువుకు మెయిల్ పెట్టాడు. అనంతరం ఫ్లాట్‌లోనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకొని కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెయిల్ చూసిన సాయి పవన్ కళ్యాణ్ హుటాహుటిగా వెంకటకృష్ణ ఫ్లాట్‌కు చేరుకున్నాడు.
ఎంతసేపు డోర్ కొట్టిన తెరవకపోవడంతో రూమ్మెట్ సహాయంతో డోర్‌ను బద్దలుకొట్టాడు. అప్పటికే రక్తపుమడుగులో పడి ఉన్న వెంకటకృష్ణను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
వెంకటకృష్ణ మరణంపై అనుమానాలు ఉన్నాయని సోదరుడు పవన్‌కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు లేదా పెండ్లి గురించి మానసికంగా ఒత్తిడికి గురై వెంకటకృష్ణ సూసైడ్ చేసుకొని ఉండొచ్చని గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు. మరో ఐదు రోజుల్లో పెండ్లి పీటలు ఎక్కాల్సిన వెంకటకృష్ణ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
