ఐటీ కారిడార్‌లో వడగండ్ల వాన…అర్ధరాత్రి ఇంటికి చేరిన ఐటీ ఉద్యోగులు
ఐటీ కారిడార్‌లో దంచికొట్టిన వాన..
విరిగి పడ్డ చెట్ల కొమ్మలు..
స్తంభించిన ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం
ధరలు పెంచేసిన ఆటోలు, క్యాబులు
అర్ధరాత్రికి ఇంటికి చేరిన ఐటీ ఉద్యోగులు
వర్షకాలం అప్పుడే వచ్చేసిందా ! అనే తీరులో ఐటీ కారిడార్‌లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు తోడు వడగండ్లతో భారీ వర్షం కురవడంతో ఐటీ కారిడార్ స్తంభించిపోయింది. ఈదురుగాలులకు చెట్లు, చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు చోట్లు విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉదయం నుండి ఉక్కపోతగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగండ్ల వర్షం కురిసింది. దీంతో ఐటీ ఉద్యోగులు, స్థానికులకు కాస్త ఉపషమనం పొందారు. సాధారణంగా మే నెలలో వడగండ్ల వర్షాలు కురుస్తాయి.. కానీ మార్చి నెలలోనే భారీ వర్షాలు కురుస్తుండడంతో అప్పుడే వర్షకాలం వచ్చేసిందా అని ఐటీ ఉద్యోగులు అనుకుంటున్నారు.

మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, హఫీజ్‌పేట్ ఏరియాల్లో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురగాలులతో కూడిన వర్షం పడింది. నాలెడ్జ్సిటీ, హఫీజ్‌పేట్, మియాపూర్, చందానగర్, కొండాపూర్ ఏరియాల్లో వడగండ్ల వర్షం కురిసింది. హఫీజ్‌పేట్, చందానగర్, మియాపూర్ ఏరియాల్లో గంటల తరబడి విద్యుత్ నిలిచిపోయింది.

గచ్చిబౌలి నుండి బయోడైవర్సిటీ వెళ్లే రోడ్డులో పిస్తాహౌజ్ వద్ద, బయోడైవర్సిటీ నుండి గచ్చిబౌలి వెళ్లే రోడ్డు సీపీ అఫీస్ సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా వర్షపునీరు చేరింది. దీంతో ఆయా రూట్లలో వాహనాలు నిలిచిపోయాయి. వర్షంనీటిలో ఒకదాని వెంట ఒకటి నెమ్మదిగా ముందుకు కదిలాయి. మియాపూర్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ వద్ద రోడ్డుపై వర్షపునీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు నీటిని తొలగిస్తున్నారు.

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ గ్రిడ్ లాక్..
ఐటీ ఉద్యోగులు అందరూ సాయంత్రం ఇండ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో వర్షం నిలిచే వరకు అఫీసుల్లోనే ఉన్నారు. వర్షం నిలిచిన వెంటనే ఉద్యోగులు అందరూ కార్లు, బైకులపై అఫీసుల నుండి బయటకు వచ్చారు. దీంతో మైండ్‌స్పేస్ నుండి బయో డైవర్సిటీ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాలెడ్జి సిటీ రోడ్లు మొత్తం వాహనాలతో నిండిపోయాయి.

ఐకియా నుండి సైబర్ టవర్స్ రూట్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొండాపూర్ నుండి మియాపూర్ రూట్, గచ్చిబౌలి నుండి షేక్‌పేట్ రూట్, గచ్చిబౌలి నుండి లింగంపల్లి రూట్లలో ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఐటీ ఉద్యోగులు ఇండ్లకు చేరుకునే సరికి అర్ధరాత్రి అయ్యింది. పలువురు వర్షం కారణంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుందని అఫీసుల్లోనే కాలక్షేపం చేశారు.
రేట్లు పెంచేసిన షేర్ ఆటోలు
మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అఫీసుల నుండి ఇండ్లకు, సమీపంలోని మెట్రో, బస్ స్టేషన్‌కు వెళ్లే ఐటీ ఉద్యోగులు తమ ఫోన్లలో ఓలా, ర్యాపిడో, ఉబర్ యాప్స్ ద్వారా ఆటో, బైక్, కార్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే బుక్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
షేరింగ్ ఆటోలో వెళ్తేందుకు ప్రయత్నిస్తే నాలెడ్జి సిటీ నుండి కిలోమీటర్ దూరంలో ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ వరకే రూ. 200 పైగా వసూళు చేస్తున్నారని ఐటీ ఉద్యోగులు వాపోయారు. చాలా మంది ఉద్యోగులకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ప్రభుత్వం ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ బస్సులు తిప్పకపోవడంతో ఉద్యోగులకు ఈ తిప్పలు తప్పడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
