పేషంట్ మెడలో 25 లక్షల బంగారం మాయం
డాక్టర్ వేషంలో వచ్చి మహిళా పేషంట్ మెడలో బంగారం చోరీ..
రూ. 25 లక్షల విలువైన బంగారం మాయం..
నల్లగండ్ల సిటిజన్ హాస్పిటల్లో ఆలస్యంగా వెలుగులోకి..
ఇటీవల యశోద ఆసుపత్రి ఘటన మరువక ముందే మరో నకిలీ డాక్టర్ కలకలం..
కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కానరానీ సెక్యూరిటీ..
నిలదీస్తే నిర్లక్ష్యపు సమాధానం..
మీరు బంగారు నగలతో నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త. ఇటీవల నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నకిలీ డాక్టర్లు హల్చల్ చేస్తున్నారు. డాక్టర్ల ముసుగులో ఆసుపత్రుల్లోకి వచ్చి ట్రీటెమెంట్ పేరుతో పేషంట్ గదుల్లోకి వెళ్తున్నారు. పేషంట్లకు మత్తు మందు ఇచ్చి వారి మెడలో ఉన్న బంగారు అభరణాలను ఎత్తుకెళ్తున్నారు.
ఇటీవల నగరంలోని యశోద ఆసుపత్రిలో ఓ నకిలీ డాక్టర్ పేషంట్‌కు మత్తు మందు ఇచ్చి 10 తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన మరువక ముందే ఐటీ కారిడార్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.
డాక్టర్ ముసుగులో వచ్చిన ఓ మహిళా… పేషంట్ గదిలోకి వెళ్లి మెడలో ఉన్న 25 లక్షల విలువైన బంగారు అభరణాలను ఎత్తుకెళ్లింది. ఇదే విషయంపై ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీస్తే తమకేం సంబంధం లేదన్నట్లు నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నగరంలో కార్పొరేట్ ఆసుపత్రులు ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో వసూళు చేయడంపైనే దృష్టి పెడుతున్నారే తప్ప భద్రత విషయంలో చీప్‌ట్రిక్స్ పాటిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి..
పేషంట్ మెడలో 25 లక్షల బంగారం మాయం..
సంగారెడ్డికి చెందిన అరుణ (63) వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో కుటుంబసభ్యులు ఈ నెల 8వ తేదీన నల్లగండ్లలోని సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేర్పించారు. అరుణకు ఆసుపత్రిలో రూమ్ నెంబర్ 6004 లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అరుణ గదిలోకి మార్చి 10వ తేదీన డాక్టర్ లా వచ్చిన గుర్తు తెలియని మహిళ ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ( 15తులాల వరకు) ఎత్తుకెళ్లింది. గాఢ మత్తులో నుంచి తేరుకున్న అరుణ తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో షాక్‌కు గురైంది. వెంటనే విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది.
అరుణ కుమారుడు రితిక్ దవాఖాన యాజమాన్యాన్ని సదరు మహిళ డాక్టర్ ఎవ్వరంటూ ప్రశ్నించడంతో సీసీ కెమెరాలు పరిశీలించిన యాజమాన్యం మహిళకు సంబంధించిన వివరాలు తెలియవని, అస్సలు ఆమె దవాఖానలో పని చేసే ఉద్యోగి కాదంటూ తెలిపారు. ఆసుపత్రి నిర్లక్ష్య ధోరణి పై మండిపడ్డ రితిక్ చందానగర్ పోలీసులను ఆశ్రయించాడు. చోరితో పాటు దవాఖాన యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రచారం పీక్.. సెక్యూరిటీ వీక్..
నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులు తమ ఆసుపత్రుల్లో బెస్ట్ వైద్య సేవలు అందిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటాయి.పేపర్లలో, టీవీల్లో యాడ్స్ ప్రమోట్ చేస్తుంటాయి. పేషంట్లను తమ ఆసుపత్రికి రప్పించేందుకు, తమ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై కొన్ని ఆసుపత్రుల్లో మరో అడుగు ముందుకు వేసి సోషల్ మీడియాలో ఫేమస్ అయినా ఇన్ఫ్లూయెన్సర్లకు డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటున్నాయి.
ప్రచారంలో పీక్‌గా ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులు తమ సెక్యూరిటీ విషయంలో మాత్రం వీక్‌గా ఉన్నాయనే చెప్పాలి. ఆసుపత్రుల్లోకి డాక్టర్ వేషంలో బయటి వ్యక్తులు వచ్చి పేషంట్ల మెడలో బంగారం దొంగలిస్తున్న గుర్తించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తమ వెంట డబ్బులు తీసుకువెళ్లాలన్నా కూడా జంకుతున్నారు.
