ఎమ్మెల్యే క్యాంపు అఫీస్ ఉండగా.. ఇంట్లో అధికారిక సమావేశాలా ?
నిరుపయోగంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం..
క్యాంప్ అఫీస్ ఉన్నా… ఎమ్మెల్యే ఇంట్లోనే అధికారిక సమీక్ష సమావేశాలు
మహిళా అధికారులను ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకోవడం ఏంటని ప్రశ్న..
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, అధికారుల తీరుపై బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఆగ్రహం..
అధికారుల తీరుపై జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు
శేరిలింగంపల్లి, వార్తమ్యాన్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఖాళీగా ఉందని, ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఉపయోగించకుండా తన ఇంటినే క్యాంపు అఫీస్గా మార్చుకున్నారని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆరోపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రొటోకాల్ ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరుకున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎమ్మెల్యే నివాసంలో అధికారులు సమీక్షా సమావేశానికి హాజరవ్వడంపై శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ హేమంత్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే ఇంట్లో సమీక్షా సమావేశాలా ?
మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి మాట్లాడుతూ.. పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి, మియాపూర్, ఆల్విన్ కాలనీ సర్కిళ్ల పరిధిలోని అభివృద్ధి పనులపై సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో తన ఇంట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏ పదవి లేని మాజీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను, ప్రొటోకాల్‌ను గాలికొదిలేసి ఎమ్మెల్యే గాంధీతో పాటు అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు.

క్యాంపు కార్యాలయాన్ని సీఎంసీకి ఇచ్చేయండి..
ఎమ్మెల్యే అధికారులతో సమీక్షలు జరపడానికి కేసీఆర్ ప్రభుత్వ హయంలో మియాపూర్‌లో క్యాంపు కార్యాలయం నిర్మించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఈ క్యాంపు కార్యాలయాన్ని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు. క్యాంపు కార్యాలయం అందుబాటులో ఉండగా, మియాపూర్ సర్కిల్ అధికారులను కూకట్‌పల్లిలోని తన ఇంటికి పిలిపించుకుని అధికారిక సమావేశాలు ఏర్పాటు చేయడం ఆంతర్యమేంటి? అని ఆమె నిలదీశారు. ఈ సమావేశంలో ఈఈ శిరీష, డీఈ శ్రీదేవి, డీఈ మౌనిక వంటి మహిళా అధికారులను ఇంటికి (లేదా అనధికారిక ప్రదేశానికి) పిలిపించి మీటింగ్ పెట్టడం మహిళలను అవమానించినట్లు కదా? అని నవతా రెడ్డి ప్రశ్నించారు. పాలనాపరమైన, అధికారిక సమీక్షలను ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో హుందాగా నిర్వహించాల్సిన బాధ్యతను గాలికి వదిలేశారని విమర్శించారు. అధికారులు సైతం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి సమీక్షల్లో పాల్గొనడం సరికాదని ఆమె హితవు పలికారు.
అధికారిక సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ మహిళా కార్పొరేటర్ భర్త ?

అధికారులతో ప్రజాప్రతినిధులు నిర్వహించే అధికారిక సమీక్షా సమావేశంలో ప్రస్తుతం ఎలాంటి అధికారిక హోదా లేని మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ భర్త ఇతర కాంగ్రెస్ నాయకులు ఏ అర్హతతో కూర్చున్నారని నవతా రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మూడు సర్కిల్ లలో ఈ ముగ్గురుకు తప్ప వేరే వారికి అర్హత లేదా? ఏ హక్కుతో మాజీ కార్పొరేటర్లను, మహిళా నేతల భర్తలను అధికారుల సమావేశానికి పిలిచారు? పాలనాపరమైన, అభివృద్ధి పనుల సమీక్షల్లో అధికారులను ఆదేశించే, లేదా వారితో చర్చించే అధికారిక హోదా వారికి ఎక్కడిది? ఇది ముమ్మాటికీ ప్రొటోకాల్ ఉల్లంఘన మరియు అధికార దుర్వినియోగమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన పరిపాలన సాగాల్సిన చోట ఇలాంటి అనధికారిక జోక్యాలను సహించేది లేదని, అధికారులు చట్టపరంగా, నిబంధనల మేరకే విధులు నిర్వర్తించాలని లేని ఎడల చట్టం వారిని శిక్షించే విధంగా పై అధికారులు దృష్టికి తీసుకువెళ్తాము అని బొబ్బ నవతా రెడ్డి హెచ్చరించారు.
