కాసులు ఇస్తే సక్రమం.. లేదంటే అక్రమమే నిర్మాణమే
మియాపూర్ సర్కిల్లో అక్రమ షెడ్ల నిర్మాణాల హవా..
ముడుపులు ముడితే అక్రమ నిర్మాణాలన్నీ సక్రమ నిర్మాణాలే అన్న తీరులో టౌన్ ప్లానింగ్..
ఫిర్యాదులు చేస్తే చూస్తాం.. పరిశీలిస్తాం.. నోటీసులు ఇస్తామంటూ కాలం వెల్లదీత..
మియాపూర్, వార్తమ్యాన్ : నూతనంగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఒకవైపు కమిషనరేట్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమ నిర్మాణాలను సహించేది లేదని పలు సందర్భాల్లో నిర్వహించిన సమావేశాల్లో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో ఆయా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ, ఇతర అధికారులకు కూడా అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కానీ మియాపూర్ సర్కిల్ విషయానికి వచ్చే సరికి కమిషనర్ మాటలను ఒట్టి మూటలుగానే మిగిలిపోయాయి. మియాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్ మాటలను పెడ చెవిన పెడుతున్నారు. సర్కిల్లో అక్రమ నిర్మాణాలతో పాటు అనుమతి లేని అక్రమ షెడ్ల నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్న వాటిపై చర్యలు తీసుకోవడంలో ఆసక్తి చూపడం లేదు. మియాపూర్ సర్కిల్లో అనుమతులు లేని భారీ అక్రమ వాణిజ్య షెడ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వీటికి ఏలాంటి అనుమతులు లేవు. వీటిపై స్థానికులు టౌన్ ప్లానింగ్ ఏసీపీ, టిపిఎస్లకు ఫిర్యాదులు చేస్తే చూస్తాం.. పరిశీలిస్తాం.. నోటీసులు ఇస్తాం అంటూ కాలం వెల్లదీస్తున్నారే తప్ప వాటిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఫిర్యాదుదారుల నుండి ఒత్తిడి వస్తే అక్రమ షెడ్లను కూల్చివేద్దామని అక్కడికి వెళ్తే వెంటనే తాజా మాజీ కార్పొరేటర్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. వాటి జోలికి వెళ్లకండి అని చెప్పగానే సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్లిపోవడం టౌన్ ప్లానింగ్ అధికారులకు పొరపాటిగా మారింది.

మియాపూర్‌లో అక్రమ వాణిజ్య షెడ్ల నిర్మాణాలదే హవా..
మియాపూర్ సర్కిల్లో అనుమతి లేని అక్రమ వాణిజ్య షెడ్ల నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. మియాపూర్ లక్కీ రెస్టారెంట్ వెనుక వైపు ఓ వ్యక్తి అక్రమ షెడ్డు నిర్మిస్తున్నాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో మియాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది వెంటనే కూల్చివేశారు. కూల్చివేసిన తెల్లవారే షెడ్ నిర్మిస్తున్న వారు టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రసన్నం చేసుకున్నారు. ఇగ తర్వాతి రోజు నుండి ఆగమేఘాల మీద షెడ్ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ ఈ కూల్చివేసిన షెడ్ సమీపంలోనే మరో భారీ వాణిజ్య షెడ్డు నిర్మాణం జరుగుతున్నా దానిని మాత్రం కదిలించలేకపోయారు. దీనికి కారణం లేకపోలేదు. ఆ అక్రమ షెడ్డు నిర్మాణం చేస్తుంది ఓ లాయర్ కావడంతో వాటిని కూల్చవేసేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు జంకుతున్నారు అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
× దీప్తి శ్రీనగర్‌కాలనీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఓ వ్యక్తి భారీ అక్రమ షెడ్డు నిర్మాణం చేపట్టాడు. దీనిపై మియాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఫిర్యాదు వచ్చినప్పుడల్లా నిర్మాణ పనులు నిలిపివేశాం.. చర్యలు తీసుకుంటాం అంటూ సమాధానాలు చెబుతూ వస్తున్నారే తప్ప దానిపై చర్యలు తీసుకోవడం లేదు. స్థానిక కాలనీవాసులు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తే… షెడ్‌పై చర్యలు తీసుకునేందుకు అధికారులు షెడ్ వద్దకు వెళ్లగా నిర్మాణదారుడు వెంటనే మాజీ ప్రజాప్రతినిధితో ఫోన్ చేయించగా, అధికారులు చర్యలు తీసుకోకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోవడం చకచక జరిగిపోయింది. ప్రస్తుతం ఆ షెడ్ నిర్మాణ పనులు పూర్తి అయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

× మియాపూర్ గురునాథం చెరువు బఫర్ జోన్లో ఓ భారీ అక్రమ షెడ్ వెలసింది. ఈ షెడ్లో కారు మెకానిక్ షాప్‌కు రెంట్‌కు కూడా ఇచ్చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో మియాపూర్ టౌన్ ప్లానింగ్ టిపిఎస్ ఆదేశాలతో చైన్మెన్లు, సిబ్బంది షెడ్ నిర్మాణాన్ని కూల్చివేశారు. రెండు రోజుల తర్వాత షెడ్ నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. మరల టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేయడానికి వెళ్తే.. వెంటనే నిర్మాణదారులు తాజా మాజీ కార్పొరేటర్‌తో ఫోన్ చేయించారు. దీంతో చేసేదేమి లేక అధికారులు, సిబ్బంది కూల్చివేయకుండానే తిరిగి అక్కడి నుండి వచ్చేశారు.

కాసులు ఇస్తే సక్రమం.. లేదంటే అక్రమమే..
మియాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి అంతూ లేకుండా పోతుందనే విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. అధికారులకు మడుపులు ఇస్తే ఏంత పెద్ద అక్రమ నిర్మాణమైనా సక్రమంగా సాగిపోతుంది. అదే తమకు ముడుపులు ఇవ్వకపోతే ఫిర్యాదు వస్తే చాలు క్షణాల్లో ఏలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తారు. దీన్ని బట్టి అధికారులు, సిబ్బంది అవినీతికి ఎంత దాసోహం అయ్యారో అర్థం చేసుకోవచ్చని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
అంతా తానై వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ కంప్యూటర్ ఉద్యోగి..
సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, షెడ్డు నిర్మాణల వెనుక టౌన్ ప్లానింగ్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఉద్యోగి హస్తం ఉందని అతనితో పాటు పనిచేసే తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు, ఏవరైనా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేస్తే వెంటనే అక్కడ వాలిపోయి వారితో బేరసారాలు మాట్లాడుకొని వాటిపై ఈగ కూడ వాలనియ్యకుండా చూస్తాడు అని తెలుస్తోంది. అక్రమ నిర్మాణదారుల వద్ద నుండి భారీగా డబ్బు వసూళు చేసి వాటిలో చైన్మెన్లు, టిపిఎస్, ఏసీపీకి వాటాలు పంచుతుండడంతో.. వారు కూడా అక్రమ నిర్మాణ షెడ్లు, నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి
