హైదరాబాద్‌లో ఈ మూడు చెరువుల వద్దనే కైట్ ఫెస్టివల్..
కైట్ ఫెస్టివల్‌కు సిద్ధమైన హైదరాబాద్ నగరం..
కూకట్పల్లి నల్లచెరువు, మాదాపూర్ తమ్మిడికుంట, పాతబస్తీ బమ్రుక్న్ ఉద్ దౌలా చెరువులు సిద్ధం
పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కైట్‌ఫెస్టివల్‌ను హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల వద్ద పతంగులను ఎగరవేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కైట్ ఫెస్టివల్ నిర్వహించే చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.
కూకట్పల్లి నల్లచెరువుతో పాటు మాదాపూర్లోని తమ్మిడికుంట, పాతబస్తీలోని బమ్-రుక్న్ – ఉద్ – దౌలా చెరువులను సందర్శించారు. మూడు నాలుగు రోజుల్లో సుందరీకరణ పనులు పూర్తి చేసి వేడుకలకు వేదికలు సిద్ధం చేయాలన్నారు. లైటింగ్ ఏర్పాట్లను పరిశీలించి, మొక్కలను విరివిగా నాటి చెరువులను సుందరీకరించాలని అధికారులను కోరారు. చెరువుల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
చెరువుల పరిసరాలు ప్రజలకు ఆకర్షణీయంగా ఉండేలా అభివృద్ధి చేయాలని, నడక మార్గాలు, లైటింగ్, శుభ్రత పనులు, భద్రతా ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. పండగ నాటికి చెరువులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఏలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
