పేషెంట్ నగలు దొంగలిస్తున్న ఆసుపత్రి హౌజ్ కీపింగ్ మహిళ అరెస్ట్
7 తులాల బంగారం, 2తులాల వెండి అభరణాలు స్వాధీనం..
ఆసుపత్రిలో పేషెంట్ సహాయకుల కళ్లుగప్పి పేషెంట్ బంగారు అభరణాలు దొంగలించిన హౌజ్‌కీపింగ్ మహిళను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమె వద్ద నుండి 7 తులాల బంగారం, 2 తులాల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ శివాజీ నగర్‌కు చెందిన జె. దుర్గ (45) మదీనగూడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో హౌజ్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తుంది.
గత నెల ఫిబ్రవరి 25వ తేదిన చందానగర్ అపర్ణ హిల్ పార్క్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చాడు. ఆమె ఎస్‌ఐసీయూలో ఉండగానేకేవలం ఐదు నిమిషాల వ్యవధిలో (రాత్రి 8:51 నుండి 8:56 మధ్య) దుర్గ లోపలికి ప్రవేశించి, భర్త దృష్టిని హేమార్చి బ్యాగులో భద్రపరిచిన 3 తులాల గొలుసు, 3 తులాల గాజులు, ఒక తులం చెవి రింగులతో పాటు 3 తులాల వెండి వస్తువులను అపహరించింది. మరుసటి రోజు ఉదయం పేషెంట్ భర్త బ్యాగులో ఉన్న బంగారు, వెండి అభరణాలు పోయినట్లు గుర్తించి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న మియాపూర్ డీఐ రమేష్ నాయుడు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హౌజ్‌కీపింగ్ స్టాఫ్‌లోని దుర్గ అనుమానాస్పదంగా గదిలోకి వెళ్లడం, విధి ముగిసిన తర్వాత భద్రతా సిబ్బందికి తన సంచిని చూపించకుండా తనిఖీల నుండి తప్పించుకోవడం కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో పోలీసులు చందానగర్‌లోని నివాసంలో దుర్గను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి వద్ద నుండి సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు, 2.5 తులాల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుర్గను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆసుపత్రులకు వచ్చేటప్పుడు విలువైన ఆభరణాలు, భారీ నగదు వెంట తీసుకురావద్దు.
ఆసుపత్రి యాజమాన్యాలు తమ సిబ్బందిపై నిఘా ఉంచాలన్నారు.
సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.
ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా సంఘటన కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
