1 min read

నార్సింగ్ చౌర‌స్తాలో పార్కును కాపాడిన హైడ్రా

 

మూడు వేల గజాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌

 

కబ్జాకు గురైన 60 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. కబ్జాదారుల చెర నుండి పార్కును రక్షించి చుట్టూ ఫెన్సింగ్​ ఏర్పాటు చేశారు. గండిపేట మండ‌లంలోని నార్సింగ్ విలేజ్‌ నార్సింగ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాయానికి చేరువులో అరుణోద‌య కాల‌నీ హుడా అనుమ‌తి పొందిన లే ఔట్లో 6078 గ‌జాలు పార్కు కోసం కేటాయించారు.

 

ఈ పార్కు స్థలంపై స్థానికంగా ఉన్న వారి క‌న్ను ప‌డింది. ఇప్పటికే 3 వేల గ‌జాల వ‌ర‌కూ అక్రమ నిర్మాణాలు వ‌చ్చేశాయి. మిగిలిన 3 వేల గ‌జాల పార్కు స్థలంలో 1600 ల గ‌జాల‌ను స్థానికంగా ఉన్న వ్యక్తి క‌బ్జా చేశారు. ప్రీకాస్ట్ ప్రహ‌రీ నిర్మించి.. అందులో షెడ్డులు వేశారు. ఈ 1600ల గ‌జాల ఆక్రమ‌ణ‌ల‌పై గ‌తంలో నార్సింగ్ మున్సిపాలిటీ అధికారులు చ‌ర్యలు తీసుకున్నారు. నిర్మాణాల‌ను తొల‌గించారు. అయినా క‌బ్జాలు ఆగ‌లేదు.

 

నార్సింగి మున్సిపాలిటీ ఇప్పుడు జీహెచ్ ఎంసీలో క‌ల‌వ‌డం.. ఈ ప్రక్రియ కొన‌సాగుతుండ‌గానే ఇదే అద‌నుగా మ‌ళ్లీ 1600ల గ‌జాలను త‌న స్వాధీనంలో ఉంచుకున్నాడు. చుట్టూ ప్రీకాస్ట్ ప్రహ‌రీ నిర్మించి.. లోప‌ల తాత్కాలిక షెడ్డులు కూడా క‌ట్టాడు. ఈ క‌బ్జా పూర్వాప‌రాల‌ను వివ‌రిస్తూ స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

 

హైడ్రా క‌మిష‌న‌ర్​ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల‌ మేర‌కు హైడ్రా అధికారులు రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల‌తో క్షేత్రస్థాయిలో ప‌రిశీలించారు. పార్కు స్థలంగానే నిర్ధారించుకున్నారు. మొత్తం పార్కు స్థలం 6078 గ‌జాలు కాగా.. 3వేల గ‌జాల వ‌ర‌కూ అక్రమ క‌ట్టడాలు వ‌చ్చేశాయి. మిగిలిన 3వేల గ‌జాల‌ను హైడ్రా సోమ‌వారం కాపాడింది. పార్కు హ‌ద్దుల‌ను నిర్ధారిస్తూ చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే పార్కు కోసం కేటాయించిన స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.