చైనా మాంజాపై పోలీసుల పంజా
కూకట్‌పల్లి పోలీసుల ప్రజా అవగాహన సమావేశం
ఒక చిన్న దారం అనేక ప్రాణాలను బలి తీసుకుంటున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చైనీస్ మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్, బాగ్ అమీర్ ప్రాంతాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీసులు ప్రజా అవగాహన సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పోలీస్ అధికారులు ప్రజలతో ముఖాముఖీగా మాట్లాడుతూ..పండగల ఆనందం పేరుతో చైనీస్ మాంజా వాడకం ప్రాణాంతకంగా మారుతోందని, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు మాత్రమే కాకుండా పక్షులు, జంతువులు కూడా తీవ్రంగా గాయపడుతూ ప్రాణాలు కోల్పోతున్నాయని స్పష్టం చేశారు. చైనా మాంజా చట్ట విరుద్ధమని, దాని తయారీ, విక్రయం, నిల్వ లేదా వినియోగం నేరమని, ఇటువంటి చర్యలపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే ప్రజా భద్రత, నేర నివారణ, ట్రాఫిక్ నియమాలపై కూడా అవగాహన కల్పిస్తూ, రోడ్లపై చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడంతో పాటు అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడం ద్వారా ప్రమాదాలు, నేరాలను అడ్డుకోవచ్చని వివరించారు.
చైనీస్ మాంజా విక్రయం లేదా వినియోగం ఎక్కడైనా జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ప్రజలందరితో చైనా మాంజాను వాడబోమని, విక్రయించబోమని, ఇతరులను కూడా వాడనివ్వమని బహిరంగంగా ప్రమాణం చేయించారు.
ఒక దారం వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదన్న లక్ష్యంతో సైబరాబాద్ పోలీస్ శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమానికి స్థానికులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని ప్రజలు స్పష్టం చేశారు.
