బయటపడ్డ నిత్య పెండ్లి కొడుకు మరో బాగోతం.. ఐటీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి
1 min read

బయటపడ్డ నిత్య పెండ్లి కొడుకు మరో బాగోతం.. ఐటీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి

 

  •  ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి..
  • 50 మంది నుండి 2 నుండి 5 లక్షల వరకు వసూళ్లు
  • రినోవేషన్​ పేరుతో కంపెనీ మూసేసిన నిందితులు..
  • నిరుద్యోగులను ముంచింది.. నిత్య పెండ్లి కొడుకే..
  • 2022లో 13 మందిని పెండ్లి చేసుకొని మోసం చేసిన అడప శివ శంకర్​ బాబు..

 

శేరిలింగంపల్లి, వార్తమ్యాన్​ : విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్​గా చేసుకొని 13 మంది మహిళలను పెండ్లి చేసుకున్న నిత్య పెండ్లి కొడుకు అడప శివ శంకర్​బాబు మరో బాగోతం బయటపడింది. పేరు మార్చుకొని మాదాపూర్​లో ఓ ఐటీ కంపెనీ మొదలుపెట్టి.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువత నుండి కోట్లాది రూపాయలు వసూళు చేసిన ఘటన వెలుగు చూసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు 50 మంది నిరుద్యోగుల వద్ద డబ్బు వసూళు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

 

ఐటీ ఉద్యోగాల పేరుతో…

 

మాదాపూర్​లోని ఓ ప్రైవేట్​ హాస్టల్​లో నివాసం ఉండే రాహుల్​ ​(26) హైటెక్​సిటీలోని ఓ కంపెనీలో నాన్​ ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేయాలని అనుకున్న రాహుల్​ తన ప్రొఫైల్​ను లింక్డిన్​ వెబ్​సైట్​లో పోస్ట్​ చేశాడు. మే 22వ తేదిన అన్వేష్​ ఆలియాస్​ అడప శివ శంకర్​బాబు అనే వ్యక్తి రాహుల్​కు కాల్​ చేశాడు. తాను మాదాపూర్​ కావూరిహిల్స్​లోని అర్క బ్రాంకోమ్ సొల్యూషన్స్ ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీ ఎండీ అని, తమ కంపెనీలో సాఫ్ట్​వేర్​ జాబ్స్​ ఉన్నాయని రాహుల్​కు తెలియజేశాడు. జాబ్​ గ్యారెంటీ కోసం అన్వేష్​ డబ్బులు కట్టాలని చెప్పడంతో రాహుల్​ అన్వేష్​ సూచించిన ఫోన్​పే నెంబర్​( భార్య సంధ్యరాణి ఫోన్​ పే నెంబర్)​కు, కొంత క్యాష్​ రూపంలో దశల వారికి మొత్తం రూ. 2,50,000 చెల్లించాడు.

ఓ ఉద్యోగికి ఇచ్చిన అపాయింట్​మెంట్​ అర్టర్​ లెటర్​

 

రినోవేషన్​ పేరు చెప్పి బిచానా ఎత్తేసి

 

డబ్బులు కట్టిన అనంతరం మాదాపూర్​లోని అర్క బ్రాంకోమ్​ సొల్యూషన్స్​ అఫీస్​కు వెళ్లిన రాహుల్​కు కంపెనీ ప్రతినిధులు అఫర్​ లెటర్​ ఇచ్చారు. ప్రస్తుతం అఫీస్​ రినోవేషన్​ పనులు జరుగుతున్నాయని, ఒక 20 రోజుల పాటు కు వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ద్వారా ట్రైనింగ్​ ఉంటుందని చెప్పాడు అన్వేష్. ప్రస్తుతం అఫీస్​కు చెందిన కంప్యూటర్స్​ అందుబాటులో లేవని, మీరు సొంతంగా ల్యాప్​టాప్​ ద్వారా వర్క్​ చేయాలని రాహుల్​కు చెప్పాడు. ఆ తర్వాత అఫీస్​ నుండి ఏలాంటి మెయిల్స్​ కానీ ఫోన్స్​ కానీ రాకపోవడంతో రాహుల్​ కంపెనీ ప్రతినిధి అన్వేష్​కు కాల్​ చేస్తే రెస్సాన్స్​ లేదు.

అన్వేష్​ అలియాస్​ శివశంకర్​ బాబు

 

దీంతో మాదాపూర్​లోని అర్క బ్రాంకోమ్​ సొల్యూషన్స్​ అఫీస్​కు వెళ్లగా క్లోజ్​ చేసి కనిపించింది. అఫీస్​ వద్ద మరికొంత మంది ఐటీ ఉద్యోగం కోసం డబ్బులు కట్టి మోసపోయినట్లు రాహుల్​ గుర్తించాడు. వెంటనే మాదాపూర్​ పోలీస్​ స్టేషన్​కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాహుల్​ లాగా దాదాపు 50 మంది వరకు సాఫ్ట్​వేర్​ ఉద్యోగం కోసం ఒక్కోక్కరు అన్వేష్​కు రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు.

 

అప్పుడు నిత్య పెండ్లి కొడుకు.. ఇప్పుడు సాఫ్ట్​వేర్​ కంపెనీ ఎండీ..

 

ఐటీ​ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద కోట్లాది రూపాయలు వసూళు చేసిన అన్వేష్​ అలియాస్​ అడప శివ శంకర్​బాబు సైబరాబాద్​ పరిధిలో విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్​గా చేసుకొని పదుల సంఖ్యలో మహిళలను పెండ్లి చేసుకున్న నిత్య పెండ్లి కొడుకు ఒక్కడే. సైబరాబాద్​లోని పలు పోలీస్​ స్టేషన్​లలో శివ శంకర్​బాబుపై చీటింగ్​ కేసులు ఉన్నాయి. విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్​గా పెట్టుకొని వారిని పెండ్లి చేసుకొని భారీగా డబ్బులు వసూళు చేసి చీటింగ్​ చేసిన నిత్య పెళ్లికొడుకు శివశంకర్​ను గచ్చిబౌలి పోలీసులు 2022 జులైలో అరెస్ట్​ చేశారు.

 

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన అడప శివ శంకర్​బాబు(36) మ్యాట్రిమోనీ సైబ్​ ద్వారా విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్​గా చేసుకొని వారితో పరిచయం పెంచుకునేవాడు. ఆతర్వాత తాను కూడా విడాకులు తీసుకున్నాని చెప్పి నమ్మించి వారిని పెండ్లి చేసుకున్నాడు. ఇప్పటి వరకు 13 మంది మహిళలను పెండ్లి చేసుకొని వేర్వేరు ఏరియాల్లో కాపురాలు పెట్టాడు. పెండ్లి తర్వాత యూఎస్​లో జాబ్​ వచ్చింది డబ్బులు కావాలంటూ లక్షల్లో డబ్బు తీసుకొని చీటింగ్​ చేసేవాడు. 2022లో కొండాపూర్​లో నివాసం ఉండే మహిళను శివశంకర్​ పెండ్లి చేసుకొని యూఎస్​కు వెళ్లాలని చెప్పి ఆమె వద్ద నుండి రూ. 32 లక్షల వరకు డబ్బు తీసుకున్నాడు. శివశంకర్​పై అనుమానం వచ్చి సదరు మహిళ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

న్యాయం చేయాలని సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ ముందు మహిళలు ధర్నా..

2022 జూలై నెలలో తమకు న్యాయం చేయాలని సైబరాబాద్​ సీపీ అఫీస్​ ఎదుట ఆందోళన చేపట్టిన నిత్య పెండ్లి కొడుకు శివ శంకర్​ బాధితులు (పాత ఫోటో)

ఒకరికి తెలియకుండా ఒకరిని పెండ్లి చేసుకొని, అవసరాల పేరిట డబ్బులు తీసుకొని చీటింగ్​ చేసిన శివ శంకర్​బాబును అరెస్ట్​ చేసి కఠినంగా శిక్షించాలని బాధిత మహిళలు మహిళా సంఘాలతో కలిసి 2022 జూలైలో సైబరాబాద్​ కమిషనరేట్​ కార్యాలయం వద్ద ఆందోళన చెపట్టారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. సీపీ అఫీస్​ ఎదుట తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. శివశంకర్​ దాదాపు 13 మంది మహిళలను పెండ్లి చేసుకొని యూఎస్​ వెళ్లాలంటూ అందిన కాడికి డబ్బులు తీసుకొని చీటింగ్​ చేశాడని, పోలీసులు శివశంకర్​ను వెంటనే అరెస్ట్​ చేయాలని బాధిత మహిళలు డిమాండ్​ చేశారు. శివశంకర్​ను కఠినంగా శిక్షించి, బాధిత మహిళలకు న్యాయం చేయాలని మహిళా సంఘాల లీడర్లు పేర్కొన్నారు.