తల్లి ఒడిలో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. లక్షన్నరకు అమ్మకానికి పెట్టి..
ఫుత్‌పాత్‌పై తల్లి ఒడిలో పడుకున్న మూడేళ్ల చిన్నారి కిడ్నాప్..
మహబూబ్‌నగర్‌లో పిల్లలు లేని మహిళకు లక్షన్నరకు అమ్మేందుకు సిద్ధమైనా ముఠా..
సీసీ కెమెరాలను జల్లెడ పట్టి.. ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం..
సైబరాబాద్, వార్త మ్యాన్ : సం తానం లేని దంపతులకు పిల్లలను విక్రయించే ప్రయత్నం చేసిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఫుట్‌పాత్‌పై తల్లితో నిద్రపోయిన ఓ మూడేళ్ల చిన్నారిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి మహబూబ్‌నగర్‌కు తరలించి అక్కడ ఓ మహిళ సహాయంతో సంతానం లేని మహిళకు విక్రయించేందుకు సిద్ధమవుతుండగా ఈ కిడ్నాప్ ముఠా గుట్టును రట్టు చేశారు. కిడ్నాప్ ముఠా చెర నుండి బాలికను రక్షించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సైబరాబాద్ సీపీ డా. రమేష్ వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం అనంతపురం జిల్లా గుంతకల్లకు చెందిన బి. గోవిందమ్మ తన భర్త, మూడేళ్ల కుమార్తెతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి లింగంపల్లి రైల్వే స్టేషన్ ఫుత్‌పాత్‌పై నివసిస్తూ వీధి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ నెల 15వ తేదిన రాత్రి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నెంబర్ 6 పక్కన ఉన్న భవాని హోటల్ ముందు ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్నారు. 16వ తేదిన తెల్లవారుజామున 4.30 గంటలకు గోవిందమ్మ నిద్రలేచి చూసేసరికి తన కుమార్తె కనిపించలేదు. చుట్టూపక్కల వెతికిన అచూకీ లభించకపోవడంతో గోవింధమ్మ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం న్యూ ప్రేమ్‌నగర్‌కు చెందిన నవనీత(31) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు డయాగ్నోస్టిక్ లాబోరేటరీలో స్టాఫ్ నర్సు అండ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుంది. అక్రమ పద్దతితో పిల్లలను దత్తత తీసుకునే సంతానం లేని భార్యభర్తలతో పరిచయాలు పెంచుకుంది. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోకి వచ్చే గర్భిణీ స్ర్తీలు, నవజాత శిశువుల వివరాలను సేకరించుకుంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ తనకు దత్తత తీసుకునేందుకు ఒక బిడ్డ కావాలని నవనీతను సంప్రదించింది. దత్తత ఇచ్చేందుకు మహిళతో రూ. 1.50 లక్షలు ఖర్చవుతుందని నవనీత మాట్లాడుకుంది.
దత్తత కోసం ఒక బిడ్డ కావాలని అందుకు డబ్బు ఇస్తానని నవనీత తనకు పరిచయం ఉన్న వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన పెయింటర్ కోతి శ్రీనివాస్(36)కి చెప్పింది. దీంతో కోతి శ్రీనివాస్ నగరంలోని బండ్లగూడ కాళీమందిర్ ప్రాంతంలో నివాసం ఉండే ఆటో డ్రైవర్ రామకృష్ణ(23) సహాయం కోరాడు. వీరిద్దరూ కలిసి ఆటోలో నగరంలో ఫుట్‌పాత్‌పై రైల్వే స్టేషన్ల వద్ద చిన్న పిల్లలతో నిద్ర నిద్రపోయే తల్లిదండ్రుల కోసం రెక్కీ నిర్వహించారు. ఈ నెల 15వ తేదిన రాత్రి శ్రీనివాస్, రామకృష్ణ కలిసి లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకొని 16వ తేదిన వేకువజామున 2 గంటల సమయంలో ఫుత్‌పాత్‌పై నిద్రపోతున్న గోవింధమ్మ మూడేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశారు. అక్కడి నుండి ఆటోలో పారిపోయారు.
కుమార్తె కనిపించడం లేదని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు, నార్సింగి, సీసీఎస్ పోలీసుల సహాయంతో సిసి కెమెరాలను చెక్ చేస్తూ వెళ్లారు. కిడ్నాప్ చేసిన అనంతరం నిందితులు ఆటోలో నగరం నుండి శంషాబాద్ వద్ద బెంగుళూరు హైవే ఎక్కి మహబూబ్‌నగర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. పరిగిలో పెయింటర్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో మహబూబ్‌నగర్‌కు చేరుకున పోలీసులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద మూడేళ్ల చిన్నారిని అమ్మేందుకు సిద్ధమవుతున్న నవనీత, ఆటో డ్రైవర్ రామకృష్ణను అదుపులోకి తీసుకొని చిన్నారిని కాపాడారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని నగరానికి తరలించారు. కిడ్నాప్‌కు గురైన చిన్నారిని సైబరాబాద్ సీపీ తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
