రక్తసిక్తమైన ఐటీ కారిడార్​ రోడ్లు… రెండు రోజుల్లోనే ఎంత మంది మృతి చెందారో తెలుసా..
1 min read

రక్తసిక్తమైన ఐటీ కారిడార్​ రోడ్లు… రెండు రోజుల్లోనే ఎంత మంది మృతి చెందారో తెలుసా..

 

రెండు రోజుల్లో మూడు రోడ్డు ప్రమాదాలు..

 

మొత్తం నలుగురు దుర్మరణం..

 

మృతుల్లో ఇద్దరు ఐటీ ఉద్యోగులు..

 

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు..

 

ఐటీ కారిడార్​ రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. రాంగ్​ రూట్​, అతివేగం, అకస్మాత్తుగా మలపడం, అజాగ్రత్తగా వాహనాలు డ్రైవ్​ చేయడం కారణంగా ఐటీ కారిడార్​లో రెండు రోజుల వ్యవధిలో నలుగురు దుర్మరణం చెందారు. ఇందులో రాంగ్​ రూట్​ డ్రైవింగ్​ కారణంగా ఇద్దరి ప్రాణాలు కోల్పోగా.. ఐటీ ఉద్యోగి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికత్స పొందుతున్నాడు. మరో రోడ్డు ప్రమాదంలో ముందు వెళ్తున్న బైకర్​ సడెన్​గా యూటర్న్​ తీసుకోగా వెనుకాలే వచ్చిన బైక్​పై వచ్చిన వ్యక్తి ముందటి బైక్​ను ఢీకొట్టి అక్కడిక్కడే ప్రాణాలొదిలాడు. మరో ప్రమాదంలో.. స్కూటీపై వెళ్తున్న భార్యభర్తలు యూటర్న్​ తీసుకుంటుండగా వెనుక నుండి దూసుకువచ్చిన కారు ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా.. భర్త ఆసుపత్రిలో చేరాడు. 

 

ఇవే రోడ్డు ప్రమాదాలు..

 

పటాన్​చెరు ఇంద్రేశంకు చెందిన విట్టల్(38)​ తన బావ మరిది శ్రీకాంత్(17)​ ఇద్దరు స్థానికంగా చికెన్​ సెంటర్​లో పనిచేస్తారు.  ఈ నెల 26వ తేదిన హైటెక్​సిటీ, గచ్చిబౌలిలో చికెన్​ డెలివరీ ఇవ్వడానికి స్కూటీపై పటాన్​చెరు నుండి హఫీజ్​ఫేట్​ మీదుగా గచ్చిబౌలి వెళ్లేందుకు కొండాపూర్​ ఆర్టీఏ అఫీస్​ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్​పైకి రాంగ్​రూట్​లో వెళ్లారు. మధ్యలోకి వెళ్లాక.. హైటెక్​సిటీ వైపు వెళ్లేందుకు అని యూటర్న్​ తీసుకొని కొద్దిదూరం వెళ్లి.. తిరిగి గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు మరల యూటర్న్​ తీసుకుంటుండగా.. అప్పుడే నైట్​ డ్యూటీ ముగించుకొని గచ్చిబౌలి నుండి హైటెక్​సిటీ వైపు వెళ్తున్న వినోద్​ వీరి స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంతో తీవ్ర గాయాలతో విట్టల్​, శ్రీకాంత్​ అక్కడికక్కడే మృతి చెందారు. ఐటీ ఉద్యోగి వినోద్​ తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

 

26వ తేదిన రాత్రి 11 గంటల సమయంలో గచ్చిబౌలికి చెందిన ఐటీ ఉద్యోగి ఆనంద్​సింగ్​(27) బైక్​పై ఖాజగూడ లేక్​ నుండి గచ్చిబౌలి కేర్​ ఆసుపత్రి వైపు వెళ్తున్నాడు. ఇంజనీరింగ్​ స్టాఫ్​ కాలేజీ ఎదురుగా ఉన్న యూటర్న్​ వద్దకు చేరుకునే సమయంలో ముందు వెళ్తున్న ఓ బైకర్​ ఏలాంటి సిగ్నల్​ ఇవ్వకుండా ఆకస్మాత్తుగా యూటర్న్​ తీసుకున్నాడు. వెనుకాలే వచ్చిన ఆనంద్​సింగ్ తన బైక్​తో ముందున్న బైక్​ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ ఆనంద్​సింగ్​ స్పాట్​లోనే మృతి చెందాడు.

ఆనంద్​సింగ్​

బోరబండకు చెందిన ఐటీ ఉద్యోగిని  కళ్యాణి(30) తన భర్త నరేష్​తో కలిసి స్కూటీపై గచ్చిబౌలి  బయో డైవర్సిటీ పార్కు సమీపంలో పక్వాన్​ రెస్టారెంట్​ ఎదురుగా ఉన్న యూటర్న్​ వద్ద ములుపు తిప్పుతుండగా.. వెనుకాల నుండి వేగంగా దూసుకువచ్చిన ఓ ఇన్నోవా కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కళ్యాణి తీవ్ర గాయాలతో చనిపోయింది. అమె భర్త నరేష్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కళ్యాణి

 

నిర్లక్ష్యం.. అతివేగం.. అవగాహనలేమి..

 

ఐటీ కారిడార్​ రోడ్లపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో కొందరూ మృతి చెందుతుండగా… మరికొందరూ తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ ప్రమాదాలకు అతివేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్​.. ట్రాఫిక్​ రూల్స్​పై అవగాహనలేమి ప్రధాన కారణాలు అని తెలుస్తోంది. వాహనాలను వేగంగా నడిపిస్తూ కంట్రోల్​ తప్పి ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టి ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు.

 

మరికొందరూ ట్రాఫిక్​ రూల్స్​పై అవగాహన లేక అపసవ్య దిశలో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవ్వడమే కాకుండా.. తాము ప్రాణాల మీదకు తెచ్చుకొని ఎదుటివారి ప్రాణాలను గండంలోకి నెడుతున్నారు. ట్రాఫిక్​ రూల్స్​, రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతపై ట్రాఫిక్​ పోలీసులు వాహనదారులకు ఎన్నీ రకాలుగా అవగాహన కల్పిస్తున్న వాహనదారులు మారడం లేదు.

 

అఫీసులకు తొందరగా వెళ్లాలనే ఉద్యోగుల హడావుడి.. ఫుడ్​ డెలివరీలు చేసే వారు తొందరగా డెలివరీ చేయాలనే ఆలోచనతో  వాహనాలు  అడ్డదిడ్డంగా నడుపుతుండడంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.