మాదాపూర్‌లో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య..
తన ఇద్దరు కుమార్తెలను వేధించిన యువకుడిని హత్య చేసిన తండ్రి, మేనమామా
కత్తితో పొడిచి. .. కర్రలతో కొట్టి దారుణ హత్య..
హత్య అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఇద్దరు నిందితులు..
మరో ముగ్గురి కోసం గాలింపు..
తన ఇద్దరు కుమార్తెలను వేధిస్తున్నాడని ఓ యువకుడిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఓ తండ్రి తన బావమరిది, మరో ముగ్గురితో కలిసి యువకుడిని కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. హత్య జరిగిన అనంతరం నిందితులు ఇద్దరు మాదాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సినపల్లి రాములు సోమక్క దంపతుల కుమారుడు భాస్కర్(32) ఇంటర్ వరకు చదువుకొని 8 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. మొదట గచ్చిబౌలలోని ఐఐఐటీ క్యాంటీన్లో కుక్‌గా పనిచేశాడు. రెండు సంవత్సరాల క్రితం మాదాపూర్ రామేశ్వర్ కేఫ్ వెనుకాల ఉన్న శ్రీ శ్రీ సూట్స్ అనే హోటల్లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు.
ఇదే గ్రామానికి చెందిన తమ్మడబోయిన రాజు అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజు పెద్ద కుమార్తెకు అదే గ్రామానికే చెందిన భాస్కర్‌తో 2020 లో పరిచయం ఏర్పడింది. ఇద్దరు చాటింగ్, ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ సన్నిహితంగా ఉన్నారు. విషయం తెలిసిన యువతి తండ్రి రాజు పెద్ద కుమార్తె జోలికి రావొద్దని రెండు మూడు సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు.
అయినా భాస్కర్ తీరు మారకపోవడంతో వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్, వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లలో భాస్కర్‌పై ఫిర్యాదులు చేశాడు. వేధింపులు తీవ్రం కావడంతో తన కుమార్తెను భాస్కర్ వేధిస్తున్నాడని 2021లో హన్మకొండలో షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
2023 మే నెలలో రాజు తన పెద్ద కుమార్తెను ఖాజిపేట్కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. వివాహం జరిగిన తర్వాత భాస్కర్ ఆ యువతితో మెసేజ్‌లు చేసి.. వాటి స్ర్కీన్ షాట్లను అమె భర్తకు పంపించాడు. ఈ విషయంపై భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. యువతి భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చేసింది. గత నెల భార్యభర్తలు విడాకులు తీసుకున్నారు.
మూడు నెలల క్రితమే రాజు పెద్ద కుమార్తె యూపిఎస్సీ ప్రిపరేషన్స్ కోసం హైదరాబాద్ బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటున్న చిన్న కుమార్తె వద్దకు వచ్చింది. కాగా.. ఇటీవల రాజు చిన్న కుమార్తెకు భాస్కర్ ఫోన్లో తన అక్క గురించి అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టాడు. అంతటితో ఆగకుండా చిన్న కుమార్తె పేరుతో ఇన్‌స్ర్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వేధించసాగాడు. ఈ వేధింపులు భరించలేక చిన్న కుమార్తె జరిగిన విషయం తన తండ్రికి చెప్పింది.
పెండ్లి చేసిన పెద్ద కుమార్తెను వేధించి, అమె భర్త విడాకులు ఇవ్వడం.. చిన్న కుమార్తెను కూడా వేధింపులకు గురిచేయడంతో భాస్కర్‌పై యువతి తండ్రి రాజు తీవ్ర కక్ష్య పెంచుకున్నాడు. భాస్కర్‌ను హత్య చేస్తేనే తన ఇద్దరు కుమార్తెలు ప్రశాంతంగా ఉంటారు అని నిర్ణయించుకున్నాడు. భాస్కర్ పనిచేసే ప్రదేశం తెలుసుకున్న రాజు మంగళవారం తన బావమరిది మరో ముగ్గురితో కలిసి కారులో వరంగల్ నుండి మాదాపూర్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి 11 గంటలకు భాస్కర్ పనిచేస్తున్న శ్రీశ్రీ సూట్స్ హోటల్ వద్దకు చేరుకున్నారు.
రాజు తన బావమరిది కుమారస్వామి కలిసి తమ అనుచరులను హోటల్ లోపలికి పంపించి మాట్లాడేది ఉందని చెప్పి భాస్కర్‌ను బయటకు రప్పించారు. రాత్రి 11.30 గంటలకు హోటల్ నుండి భాస్కర్ బయటకు రాగానే రాజు తన బావమరిది మరో ముగ్గురు అనుచరులతో కలిసి వెంట తెచ్చుకున్న చిన్న కత్తితో భాస్కర్‌ను పొడిచారు. అనంతరం వెంట తెచ్చుకున్న కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలై భాస్కర్ అపస్మారకస్థితికి చేరుకున్నాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ భాస్కర్‌ను కొండాపూర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. మృతుడి సోదరుడు మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ ఇన్స్పెక్టర్ నిందితులపై ఎస్సీఎస్టీ, హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజు, అతని బావమరిది కుమారస్వామి హత్య అనంతరం మాదాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోగా, మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
