లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ వినయ్
హైకోర్టు నోటీసులు ఇచ్చేందుకు లక్ష లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ
రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ వినయ్
పోలీస్ డిపార్ట్మెంట్లో మరో అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది. ఓ కేసులో నోటీసులు ఇచ్చేందుకు బాధితుడిని మాదాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసి మొదటి విడుతలో రూ.50వేలు తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోడంతో ఓ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీకి చెందిన వ్యక్తి మీద మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై ఎస్ఐ వినయ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదే కేసుపై సదరు వ్యక్తి హైకోర్టుకు వెళ్లడంతో..అతనికి నోటీసులు ఇచ్చి విచారించాలని పేర్కొంది. దీంతో ఎస్ఐ వినయ్ నోటీసులు ఇచ్చేందుకు బాధితుడిని లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడు.
అంత డబ్బు ఇచ్చుకోలేను అని చెప్పడంతో ఎస్ఐ రెండు దఫాలుగా ఇవ్వాలని తెలియజేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం బాధితుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినయ్‌కు రూ. 50 వేలు డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఎస్ఐను అదుపులోకి తీసుకొని అతని సెక్షన్లో విచారణ చేపట్టారు. అనంతరం ఎస్ఐ వినయ్‌ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో మాదాపూర్ ఇన్స్పెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులకు ఏమైనా లింకులు ఉన్నాయా అని ఏసీబీ అధికారులు అరా తీస్తున్నారు.
