డ్రోన్లు, ఏఐతో వ్యవసాయం మానిటరింగ్​… ఏపీ సీఎం చంద్రబాబు
1 min read

డ్రోన్లు, ఏఐతో వ్యవసాయం మానిటరింగ్​… ఏపీ సీఎం చంద్రబాబు

 

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగే విధంగా చర్యలు చేపట్టాలి

 పది సూత్రాల్లోని అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం

 

పది సూత్రాల్లో భాగంగా ఫార్మర్ అగ్రిటెక్, లాజిస్టిక్స్, విద్యుత్ సంస్కరణలు వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయంలో ఏఐ సాంకేతికత, విద్యుత్, విత్తన నిర్వహణ, డ్రోన్లు, యాంత్రీకరణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, మెరుగైన ధరలు లభించేందుకు ఉన్న అవకాశాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని సూచించారు. గ్లోబల్ మార్కెట్ ఉండే పంటలపై ఎక్కువ దృష్టి సారించాలని సీఎం పేర్కొన్నారు. నెట్ జీరో ఎమిషన్ కాన్సెప్ట్‌తో విద్యుత్ ఉత్పాదన జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు వరకూ 4 లేన్ రైల్వే లైన్ వస్తోందని, స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే సాకారమవుతుందని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తయారు చేసేందుకు.. ప్రస్తుతం.. రాయలసీమ నుంచే 220 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని, త్వరలోనే 400 మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేట్ పెట్టుబడులపైనా దృష్టి కేంద్రీకరించాలన్నారు.

 

ట్రూ డౌన్ ద్వారా వినియోగదారుడికి ప్రయోజనం దక్కాలని సీఎం చంద్రబాబు అన్నారు. పీఎం కుసుమ్, సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. రూ.3.90కే విద్యుత్ కొనుగోలు ధర తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కుప్పంలో ఇటీవల 5 వేల పైచిలుకు ఈ-సైకిళ్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ తరహా విధానాల వల్ల వేగంగా ట్రాన్సిషన్ జరుగుతుందని వివరించారు. గతంలో ఏపీలో నీరు, విద్యుత్ విషయంలో లోటు ఉండేదని.. ఇప్పుడు మిగులు ఏర్పడే పరిస్థితి ఉందని చెప్పారు. 1 మీటరు భూగర్భ జలాలను పెంచటం ద్వారా దాదాపు రూ.4 వేల కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్టీసీలో కనీసం వెయ్యి బస్సులను ఈవీగా మార్చాల్సిన అవసరముందని పేర్కొన్నారు.