హైటెక్‌సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి డ్రగ్స్ దందా
అతనో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఉద్యోగం చేస్తుండగా వచ్చే జీతం సరిపోకపోవడమో లేదా సులభంగా డబ్బు సంపాధించాలనే కారణంతోనో డ్రగ్స్ విక్రయించాలని డిసైడ్ అయ్యాడు. బెంగుళూరు నుండి డ్రగ్స్ తీసుకువచ్చి ఐటీ కారిడార్‌లో ఐటీ ఉద్యోగులకు అమ్మేందుకు సిద్ధమవుతుండగా పోలీసులకు చిక్కాడు. దీంతో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అతని వద్ద నుండి 11 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ముత్యాల సాయికిరణ్(28) ఉద్యోగం నిమిత్తం నగరానికి వచ్చి ఓ ఐటి సంస్థలో టెక్నికల్ సపోర్టుగా పనిచేస్తున్నాడు.
గౌలిదొడ్డి కేశవనగర్ లోని నెస్ట్ ఇన్ హోమ్స్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నాడు. కాగా తనకు పరిచయం అయిన రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి నిషేదిత ఎండీఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. కేశవనగర్ లోని తన నివాసంలో డ్రగ్స్ ఉంచి విక్రయించేందుకు ప్రయత్నించాడు. కాగా ఈ విషయమై సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు సాయికిరణ్ నివాసం మీద సోమవారం రాత్రి దాడి చేశారు.
ఇంట్లో నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకొని సాయికిరణ్‌ను అరెస్టు చేశారు. ఇతనితో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వచ్చిన నిజాంపేటకు చెందిన కౌశిక్(26), షాబాద్‌కు చెందిన ఏ. రాఘవేంద్రరెడ్డి (30)ల మీద సైతం కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ఈమేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు
