కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలను డ్రైవ్ చేయండి.. సైబరాబాద్ సీపీ రమేష్
ఇంటికి క్షేమంగా చేరడమే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యం
సైబరాబాద్‌లో అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాలు
రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని, ఎంతో మంది ఆప్తులను కొల్పోతున్నారని, ఈ ప్రమాదాలను తగ్గించడమే అరైవ్ అలైవ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ తెలిపారు. మానవ ప్రాణం అమూల్యమైనదని, ప్రతీఒక్కరూ తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సీపీ డాక్టర్ ఎం. రమేష్ అన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బసంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కూకట్ పల్లి ఐడీఎల్ చెరువు వద్ద సైబరాబాద్ సీపీ సిబ్బందితో కలిసి హెల్మెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. “స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ” అనే నినాదాన్ని అందరూ ఆచరించాలన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఈ ప్రమాదాలు తగ్గించడమే “అరైవ్ అలైవ్” కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో.. ఈ తరహా అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలన్నారు.

సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో జనవరి 13 నుంచి 23 వరకూ “అరైవ్ అలైవ్” కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమాలను వివిధ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇతర ప్రాంతాల్లో ప్రజలందరినీ భాగస్వాములుగా చేసుకుంటూ నిర్వహించారు. సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కొండపూర్ ఆర్టీఓ ఆఫీసులో..
“అరైవ్ అలైవ్” కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డాక్టర్ గజరావు భూపాల్ మాట్లాడుతూ.. మానవ తప్పిదాల వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం, వేగ పరిమితులు పాటించడం వంటి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.
కూకట్పల్లి జోన్లో..
బాలానగర్‌లో హెచ్ఏఎల్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన “అరైవ్ అలైవ్”లో భాగంగా కూకట్ పల్లి డీసీపీ రితీరాజ్ మాట్లాడుతూ.. మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్య చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరాలన్నదే” మా లక్ష్యమన్నారు.
శేరిలింగంపల్లి జోన్లో..
మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ముఖ్య ఉద్దేశమన్నారు. ఓవర్ స్పీడింగ్ ప్రమాదకరమన్నారు. 20 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఉన్న దగ్గర 40 కిలోమీటర్ల స్పీడ్, 40 ఉన్న చోట 60 కిలోమీటర్ల వేగం, 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్లడం ప్రమాదాలకు కారణమన్నారు.
కూకట్పల్లి జోన్లో..
కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ I రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు మన కోసమే ఉన్నాయని, రోడ్డుపైకి వచ్చాక కుటుంబాన్ని గుర్తు చేసుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నెమ్మదిగా వెళ్లాలన్నారు. అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా కాలేజీలు, ఆటో టాక్సీ డ్రైవర్లకు, ప్రజలకు కూడళ్ల వద్ద ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పలు పాఠశాలల్లో క్విజ్, రంగోలి, వ్యాసరచన పోటీల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్మెట్లు పంపిణీ, ప్రతిజ్ఞలు, బాధితుల గాథల ద్వారా ప్రజలకు మరింత స్ఫూర్తినిచ్చే వివిధ కార్యక్రమాలు నిర్యాహించారు. ‘అరైవ్ అలైవ్’ – ప్రతీ ప్రయాణం సురక్షితంగా ముగియాలనే సంకల్పంతో సైబరాబాద్ పోలీసులు ప్రజలతో కలిసి రహదారి భద్రతకు నిబద్ధధ తో ముందుకు సాగుతున్నారు.
