1 min read

దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా నజర్​

 

దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా ఫోకస్​ పెట్టింది. చెరువులో మురుగునీరు చేరి కంపు కొడుతుండడం, నీటిపై భారీగా గుర్రపుడెక్క తేలియాడుతుండడంపై ఫిర్యాదుల వచ్చిన నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ మంగ‌ళ‌వారం దుర్గం చెరువును ప‌రిశీలించారు. చెరువులో స‌గ‌భాగం వ‌ర‌కూ గుర్రపు డెక్క వ్యాపించడానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. ఎస్‌టీపీలు ఉన్నప్పటికీ వ‌ర‌ద కాలువ ద్వార మురుగు నీరు నేరుగా దుర్గం చెరువులోకి క‌ల‌వ‌డం ప‌ట్ల క‌మిష‌న‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్‌టీపీల సామ‌ర్థ్యానికి మించిన మురుగు నీరు వ‌స్తే మురుగు కాలువ‌కు మ‌ళ్లించాలి కాని.. నేరుగా చెరువులోకి ఎలా క‌లుపుతార‌ని ప్రశ్నించారు. ఒక‌వైపు ఎస్‌టీపీ ద్వారా మురుగు నీటిని సుద్ధి చేసి చెరువులోకి పంప‌డం.. మ‌రో వైపు నేరుగా మురుగు నీరు వ‌దిలేయ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, ఇరిగేష‌న్ శాఖ‌, ర‌హేజా మైండ్‌స్పేస్‌, ఎస్‌టీపీల నిర్వహ‌ణ బాధ్యత‌లు చేప‌ట్టిన రాంకీ సంస్థ‌ల మ‌ధ్య స‌మ‌న్వయం లేక‌పోవ‌డం, బాధ్యత ప‌డ‌క‌పోవ‌డ‌మే దుర్గం చెరువు దుర్గంధానికి కార‌ణ‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ తెలిపారు.

చుట్టుప‌క్కల మురుగు నీరంతా ఎస్‌టీపీ లైన్లోకి వెళ్లేలా జాగ్రత్త ప‌డాల్సిన సంబంధిత అధికారులు ఆ దిశ‌గా ప‌ని చేయ‌డం లేద‌ని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌టీపీల వ‌ద్ద మురుగు నీరు శుభ్రం అయిన త‌ర్వాత నీటి న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్షల‌కోసం పీసీబీకి పంపాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ అధికారుల‌ను ఆదేశించారు.

దుర్గం చెరువును క్షేత్రస్థాయిలో ప‌రిశీలించిన అనంత‌రం హైడ్రా కార్యాల‌యంలో చెరువు ప‌రిర‌క్షణ బాధ్యత‌లు చేప‌ట్టిన అన్ని సంస్థల‌తో హైడ్రా క‌మిష‌న‌ర్ స‌మావేశ‌మ‌య్యారు. వ‌ర‌ద కాలువ‌లోకి మురుగు నీరు వెళ్లకుండా పైపులైను డైవ‌ర్షన్ ప‌నులు చేప‌ట్టడానికి జ‌ల‌మండ‌లికి ఉండే ఇబ్బందుల‌ను తొల‌గించారు. సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ డా. ఎం ర‌మేష్ తో మాట్లాడి ట్రాఫిక్ డైవ‌ర్షన్‌కు స‌హక‌రించాల‌ని సూచించారు.

అలాగే ఇరిగేష‌న్‌, విద్యుత్‌, జీహెచ్ ఎంసీ, జ‌ల‌మండ‌లి విభాగాధికారుల‌తో కూడా మాట్లాడి మురుగునీరు దుర్గం చెరువులోకి చేర‌కుండా చేప‌ట్టే ప‌నుల‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో చెరువు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టిన ర‌హేజా సంస్థ ప్రతినిధుల‌తో కూడా మాట్లాడి ఇన్ ఆర్బిట్ మాల్‌, నెక్టర్ గార్డెన్స్ ఇలా పై భాగంలోని ఐటీ సంస్థల నుంచి వ‌చ్చే మురుగు నీరు చెరువులోకి క‌ల‌వ‌కుండా చెరువుకు ఆనుకుని ప‌డ‌మ‌ర వైపు కాలువ‌ను త‌వ్వేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు.

ఖాజాగూడ చెరువు కబ్జాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్​

శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ చెరువు క‌బ్జాలపై హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ మంగళవారం చెరువు పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఖాజాగూడ చెరువు తూములు, అలుగులు మూసేయ‌డం డైవ‌ర్ట్ చేయ‌డంపై ప్రజ‌ల నుంచి ప్రజావాణిలో వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో.. క్షేత్రస్థాయిలో ఖాజాగూడ చెరువు అలుగుతో పాటు తూములు మూసేయ‌డం డైవ‌ర్ట్ చేసిన‌ట్టు గుర్తించారు. చెరువు కింద భాగంలో దీనికి అనుసంధానంగా ఉన్న చిన్న చెరువు రూపురేఖ‌లు మార్చిన‌ట్టు గుర్తించారు. చెరువు ఆన‌వాళ్లు లేకుండా చేయ‌డాన్ని గ‌మ‌నించారు. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో కొంత‌మంది ఆక్రమించుకుని షెడ్డులు నిర్మించిన‌ట్టు గుర్తించారు. త‌మ‌ది భూమి అంటున్నవారి వ‌ద్ద ఉన్న ప‌త్రాల‌ను ప‌రిశీలించాల‌ని కమిషనర్​ అధికారులను ఆదేశించారు.