హైటెక్‌సిటీలో కుంగిన రోడ్డు… తప్పిన పెను ప్రమాదం
ఐటీ కారిడార్‌లో నిత్యం వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ఆ రోడ్డులో ఒక్కసారిగా రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. ఈ భారీ గొయ్యి కారణంగా ఆ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐకియా నుండి జేఎన్టీయూ వెళ్లే రూట్లో సైబర్ గేట్‌వే ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డు శుక్రవారం సాయంత్రం కుంగిపోయింది. రోడ్డు కుంగడంతో ఈ రూట్లో వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు.
ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం కావడం, జేఎన్టీయూ వెళ్లే ప్రధాన రోడ్డు ఇదే అవ్వడం, ఇదే సమయంలో రోడ్డు కుంగి గొయ్యి ఏర్పడడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే కుంగిన రోడ్డు వద్ద సూచిక బోర్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు. రోడ్డు పక్కనే ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్ నుండి మురుగునీరు లీకేజీ అవ్వడం వలనే రోడ్డు కుంగిదని తెలుస్తోంది. ప్రస్తుతం కుంగిన రోడ్డుకు టీజీఐఐసీ అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.
