విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడి దుర్మరణం..!
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రెండేళ్ల నిండు ప్రాణం బలి !
తెరిచి ఉన్న ప్యానెల్ బోర్డు ఫెన్సింగ్..
లోపలికి వెళ్లిన బాలుడికి తీగలు తగిలి విద్యుత్ షాక్..
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమే తమ కుమారుడి మృతికి కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ..
శేరిలిగంపల్లి, వార్తమ్యాన్ : విద్యుత్ శాఖ నిర్లక్ష్యం చందానగర్ పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఓ రెండేళ్ల చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. అస్తవ్యస్తంగా, ఎలాంటి రక్షణ లేకుండా వదిలేసిన విద్యుత్ మీటర్ల తీగలను తాకడంతో రెండేళ్ల బాలుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పాపిరెడ్డి కాలనీ 47వ బ్లాక్ 1వ నెంబర్ ఇంట్లో సునీల్ రాథోడ్, భార్య స్వప్న, ముగ్గురు కుమారులతో కలిసి నివాసముంటున్నాడు. సునీల్ రాథోడ్ రెండవ కుమారుడు గణేష్ రాథోడ్ (2) మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ తెరిచి ఉన్న ఫెన్సింగ్ లోపలి విద్యుత్ మీటర్ల విద్యుత్ తీగలను తాకడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించిన, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. “మా బిడ్డను అధికారుల నిర్లక్ష్యమే పొట్టనబెట్టుకుందని, ఎన్ని సార్లు విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోలేదని, లోపాలను సరిచేసి ఉంటే మా కొడుకు బతికేవాడు” అంటూ ఆవేదన చెందారు. పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప సముదాయంలో కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేవని, విద్యుత్ ప్యానెల్‌లు, ఓపెన్ వైరింగ్, నిర్వహణ లోపాలతో ఎప్పటికప్పుడు ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సముదాయంలోని అన్ని విద్యుత్ సౌకర్యాలను వెంటనే సురక్షితంగా మార్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
