ఐటీ కారిడార్లో పట్టపగలే భారీ దోపిడీ.. 57 లక్షలతో జంపైన డ్రైవర్​
1 min read

ఐటీ కారిడార్లో పట్టపగలే భారీ దోపిడీ.. 57 లక్షలతో జంపైన డ్రైవర్​

 

ఏటిఎంలో క్యాష్​ నింపే వాహనంతో పరారైన డ్రైవర్​..

కొద్దిదూరంలో వాహనాన్ని వదిలేసి 57 లక్షలతో జంప్​

 

ఐటీ కారిడార్​లో పట్టపగలు ఓ భారీ దోపిడీ జరిగింది. ఏటిఎం సెంటర్​లలో క్యాష్​ నింపేందుకు వెళ్లిన ఓ డ్రైవర్​  డబ్బులు ఉన్న వాహనంతో పాటు పరారయ్యాడు. వాహనంలో ఉన్న ఇద్దరు కస్టోడియన్లు ఏటిఎంలో డబ్బులు పెడుతుండటం, సెక్యూరిటీ గార్డు మూత్ర విసర్జన కోసమని బయటకు వెళ్లడంతో ఇదే అదునుగా వాహనంతో పాటు డ్రైవర్​ అక్కడి నుండి పరారయ్యాడు. కొంత దూరం వెళ్లాక వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్​ చేసి అందులో ఉన్న డబ్బులు తీసుకొని అక్కడి నుండి ఎస్కేప్​ అయ్యాడు.

నిందితుడు అజిత్​

ఈ సంఘటన గచ్చిబౌలిలోని గోపన్​పల్లిలో జరిగింది. తిరుమలగిరికి చెందిన అజిత్​ సికింద్రాబాద్​కు చెందిన సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్​ సంస్థకు బ్యాంకుల్లో డబ్బులు నింపే సీఎంఎస్​ వ్యాన్​కు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. సంగం సెక్యూరిటీ సంస్థకు చెందిన సీఎంఎస్​ వాహనంలో ఎస్​. రామకృష్ణ, ఎండి. మాలిక్​లు కస్టోడియన్లుగా, పెరుమాలు సెక్యూరిటీ గార్డుగా, అజిత్​కుమార్​ డ్రైవర్​గా గురువారం డ్యూటీకి బయలుదేరారు.

 

ఉదయం నుండి సాయంత్రం వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 8 యాక్సిస్​ ఏటిఎంలలో డబ్బులు నింపారు. గోపన్​పల్లిలలోని యాక్సిస్​ బ్యాంక్​ ఏటిఎంలో డబ్బులు నింపేందుకు సాయంత్రం 4 గంటలకు గోపన్​పల్లికి చేరుకున్నారు.  ఇద్దరు కస్టోడియన్లు ఏటిఎంలోకి వెళ్లగా, సెక్యూరిటీ గార్డు పెరమాలు, డ్రైవర్​ అజిత్​ వాహనం వద్దనే ఉన్నారు. సెక్యూరిటీ గార్డు మంచినీళ్ల కోసం పక్కకు వెళ్లగానే అజిత్​ ఇదే అదునుగా క్యాష్​తో ఉన్న వాహనంతో పాటు అక్కడి నుండి పారిపోయాడు. తెల్లాపూర్​ వద్ద వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్​ చేసిన అజిత్ అందులో ఉన్న 57 లక్షల క్యాష్​ తీసుకొని ఉడాయించాడు.

 

వెంటనే అప్రమత్తమైన కస్టోడియన్​ రామకృష్ణ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు వాహనం జీపిఎస్​ ఆధారంగా తనిఖీ చేయగా తెల్లాపూర్​లోని గద్దర్​ జంక్షన్​ వద్ద అజిత్​ వాహనాన్ని వదిలేసి వెళ్లిన్నట్లు గుర్తించారు.  ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు.