ఇంటికి వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో బంగారం ఎత్తుకెళ్లిన చైన్‌స్నాచర్
బంగారం ధర పెరగడంతో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
శనివారం ఇద్దరు మహిళల మెడలో 13 లక్షల 8 తులాల బంగారం లాక్కెళ్లిన స్నాచర్
బంగారం ధర అకాశాన్ని తాకుతుండడంతో ఇదే అదునుగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్‌గా స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం గుడిలో అన్నదానానికి వెళ్లి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో నుండి ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి బంగారు గొలుసులు లాక్కెళ్లాడు. ఈ సంఘటనతో స్థానికంగా ఒక్కసారిగా అలజడి రేగింది. ఒకేసారి ఇద్దరు మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లడంతో స్థానికంగా ఉన్న మహిళలు భయాందోళన చెందుతున్నారు.
లింగంపల్లి ఓల్డ్ ఎంఐజీలో నివాసం ఉండే పొట్లపల్లి సత్యవతి(73), చాగంటిపాటి జయభారతి(72) ఇద్దరు కలిసి శనివారం ఉదయం కిలోమీటర్ దూరంలో ఉన్న రామాలయం దేవాలయానికి వెళ్లారు. అక్కడ భోజనాలు చేసాక తిరిగి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వీరికి ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి సత్యవతి మెడలో నుండి బంగారు పుస్తెలతాడు, నల్లపూసల దండ, జయభారతి మెడలో బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఉదంతంతో ఉలిక్కిపడ్డ ఇద్దరు మహిళలు వెంటనే తమ కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న చందానగర్ పోలీసులు ఇద్దరు ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సత్యవతి మెడలో 6 తులాల బంగారం, జయభారతి మెడలో రెండు తులాల బంగారు గొలుసు స్నాచింగ్ జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో చైన్ స్నాచర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చైన్ స్నాచర్ కోసం ఓల్డ్ ఎంఐజీ చుట్టూ సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. 8 తులాల బంగారం విలువ దాదాపు రూ. 13 లక్షలు ఉంటుందని బాధిత మహిళలు చెబుతున్నారు.
