రూపాయి పతనం.. వారికి మరింత లాభం
1 min read

రూపాయి పతనం.. వారికి మరింత లాభం

రూపాయి పతనానికి కారణాలెన్నో

దిగుమతులు తగ్గడం, వాణిజ్య లోటుతో అనిశ్చితి

భారం కానున్న విదేశీ విద్య, పెరనున్న దిగుమతి వస్తువులు ధరలు

 

ఒక కరెన్సీ విలువ (మారకం రేటు) అనేది డిమాండ్ అండ్​ సరఫరా సూత్రంపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరిగితే, రూపాయి విలువ తగ్గుతుంది. అంతర్జాతీయ మారకపు మార్కెట్‌లో ప్రస్తుత ట్రేడింగ్ ప్రకారం, అమెరికన్ డాలర్‌తో పోల్చినప్పుడు భారత రూపాయి మారకం విలువ ప్రస్తుతం 19 పైసలు తగ్గి 90.15 వద్ద ఉంది. ఏడాది కాలంలో రూపాయి విలువ 6.57 శాతం తగ్గింది.

 

అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎందుకు తక్కువగా ఉంటుంది అనే అంశం కేవలం భారత్‌కే కాకుండా, ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలకు సంబంధించిన సమస్యగా మారింది. రూపాయి పతనం అయినా కూడా కొన్ని రంగాలకు ప్రయోజనం కూడా ఉంటుంది. భారత్​ నుండి విదేశాలకు వస్తువులను, లేదా ఐటీ వంటి సేవలను ఎగుమతి చేసే కంపెనీలను లాభం ఎక్కువగా ఉంటుంది.

 

రూపాయి విలువ తక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు

 

రూపాయి విలువ తక్కువగా (లేదా పడిపోవడానికి) ఉండటానికి డాలర్​కు అంతర్జాతీయ ప్రాబల్యంతో పాటు మరిన్నీ కారణాలు ఉన్నాయి.

ప్రపంచ రిజర్వ్ కరెన్సీ.. అమెరికన్ డాలర్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, ఆమోదయోగ్యమైన కరెన్సీ. అంతర్జాతీయంగా జరిగే చమురు, బంగారంతో పాటు అనేక వస్తువుల లావాదేవీలు డాలర్‌లలోనే జరుగుతాయి. ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి లేదా సంక్షోభం ఏర్పడినప్పుడు.. పెట్టుబడిదారులు తమ డబ్బును నష్టపోకుండా కాపాడుకోవడానికి ‘డాలర్‌’లలో పెట్టుబడి పెడతారు. దీనివల్ల డాలర్‌కు డిమాండ్ పెరిగి, దాని విలువ పెరుగుతుంది.

 

అధిక వాణిజ్య లోటు

 

భారతదేశం తన ఎగుమతుల కంటే దిగుమతులను ఎక్కువగా చేసుకుంటుంది. విదేశాల నుండి ముఖ్యంగా ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, బంగారం వంటి వాటిని భారీగా దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతులకు మనం డాలర్‌లలో చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో డాలర్‌ల కోసం డిమాండ్ పెరిగి రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది.

 

విదేశీ పెట్టుబడుల తరలింపు

 

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడతారు. అమెరికా వంటి దేశాలలో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఈ పెట్టుబడిదారులు లాభాలు తీసుకోవడానికి లేదా మెరుగైన రాబడి కోసం తమ డబ్బును భారత మార్కెట్ నుండి వెనక్కి తీసుకుని డాలర్‌లలో తరలించుకుంటారు. ఈ తరలింపు కోసం వారు రూపాయలను డాలర్‌లుగా మార్చుకోవలసి వస్తుంది. ఇది డాలర్‌కు డిమాండ్‌ను పెంచి రూపాయిని బలహీనపరుస్తుంది.

 

ద్రవ్యోల్బణం

 

భారత్‌లో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రూపాయి కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీర్ఘకాలంలో ఇది కూడా రూపాయి విలువ తగ్గిపోవడానికి ఒక కారణం అవుతుంది.

 

చమురు ధరల ప్రభావం

 

భారతదేశం తన చమురు అవసరాలలో 80% పైగా దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగితే మన దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. ఈ బిల్లును డాలర్లలో చెల్లించాల్సి రావడం వల్ల రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది.

 

రూపాయి పతనానికి కారణమేంటి..?

 

—రూపాయి విలువ పతనం కావడం అనేది మన దేశం దిగుమతులపై ఆధారపడటం డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా ఉండటం వంటి నిర్మాణపరమైన ప్రపంచ మార్కెట్ కారకాలపై ఆధారపడి ఉంటుంది. రూపాయి విలువ పతనం భారతీయులందరిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక భారాన్ని పెంచుతుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థపై, సామాన్యుడి దైనందిన జీవితంపై దీని ప్రభావం ఇలా ఉంటుంది.

 

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల

 

రూపాయి పడిపోవడం వల్ల దిగుమతులు ఖరీదైనవిగా మారుతాయి. భారతదేశం దిగుమతి చేసుకునే అనేక ముఖ్యమైన వస్తువుల ధరలు పెరుగుతాయి
పెట్రోల్ & డీజిల్.. భారత్ తన ముడి చమురు అవసరాలలో సుమారు 80% పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. రూపాయి బలహీనపడితే అదే మొత్తంలో చమురు కొనడానికి మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి.

 

రవాణా ఖర్చులు.. ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువులను ఒక చోటు నుండి మరొక చోటుకు తరలించేందుకు రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఈ భారం చివరకు వినియోగదారులైన మనపై పడుతుంది. తద్వారా కూరగాయలు, పాలు, కిరాణా సరుకుల ధరలు పెరుగుతాయి.

 

వంట నూనెలు, ఎరువులు, బోగ్గు.. దేశీయంగా సరిపడా ఉత్పత్తి లేని వంట నూనెలు, వ్యవసాయానికి ఉపయోగించే ఎరువులు, పరిశ్రమల్లో వాడే ఇతర ముడి పదార్థాల దిగుమతి ఖర్చు కూడా పెరిగి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది.

 

భారం కానున్న విదేశీ విద్య అండ్​ ప్రయాణం

 

విదేశాలకు వెళ్లాలనుకునే లేదా ఇప్పటికే ఉన్నవారిపై రూపాయి పతనం తీవ్ర ప్రభావం చూపుతుంది. విదేశాలలో చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజులు, వసతి, జీవన వ్యయాలను డాలర్లలో చెల్లించాలి. ఒక డాలర్ విలువ పెరిగితే, దానిని కొనడానికి వారు ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒకప్పుడు 1 డాలర్‌కు ₹80 చెల్లిస్తే, ఇప్పుడు ₹90 చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల విద్యార్థుల కుటుంబాలపై లక్షల్లో అదనపు భారం పడుతుంది.

 

విదేశీ ప్రయాణం.. విదేశాలకు పర్యాటకానికి వెళ్లే వారికి ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎందుకంటే విమాన ఛార్జీలు, హోటల్ బుకింగ్‌లు, అక్కడ చేసే ఖర్చుల కోసం ఎక్కువ రూపాయలు ఇచ్చి డాలర్లను కొనుగోలు చేయాలి. విదేశీ కరెన్సీల్లో రుణాలు తీసుకున్న భారతీయ కంపెనీలు లేదా ప్రభుత్వం రూపాయి బలహీనపడటం వల్ల ఎక్కువ రూపాయలను తిరిగి రుణాలుగా చెల్లించాల్సి వస్తుంది.

 

ఆర్థిక మార్కెట్లపై ప్రభావం

 

రూపాయి విలువ పడిపోతున్నప్పుడు, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కొనసాగిస్తే, స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతాయి. ఇది దేశీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.

 

రూపాయి పతనం వల్ల పెరిగే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే, ఇల్లు లేదా కారు లోన్ తీసుకున్న సామాన్యులకు ఈఎంఐ భారం కూడా పెరుగుతుంది.

 

రూపాయి పతనంతో లాభాలు పొందనున్న ఎగుమతిదారులు..

 

రూపాయి బలహీనపడటం వల్ల కొన్ని రంగాలకు ప్రయోజనం కూడా ఉంటుంది. భారతదేశం నుండి వస్తువులు లేదా సేవలను (ఉదాహరణకు, ఐటీ సేవలు, టెక్స్‌టైల్స్, ఫార్మా ఉత్పత్తులు) విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలకు లాభం కలుగుతుంది. ఎందుకంటే విదేశీ కస్టమర్ డాలర్‌లలో చెల్లించినప్పుడు,అది రూపాయల్లోకి మారితే వారికి ఎక్కువ మొత్తం లభిస్తుంది.

 

ప్రవాస భారతీయులు విదేశాలలో ఉద్యోగాలు చేసి, భారతదేశంలోని తమ కుటుంబాలకు డాలర్‌లలో డబ్బు పంపేవారికి ఎక్కువ రూపాయలు లభిస్తాయి.