ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో చీప్ లిక్కర్ పోసి అమ్ముతుండ్రు.. ఎక్కడంటే
మద్యం ప్రియులకు ఎప్పటికైనా ఫారిన్ లిక్కర్‌ను ఒక్కసారి అయినా తాగాలని ఉంటుంది. కానీ వాటి ధరను చూసి ఆ మందును తాగేందుకు మొగ్గుచూపరు. కానీ తక్కువ ధరకే ఫారిన్ లిక్కర్ దొరుకుతే మందుబాబులకు పండుగే. ఈ అవకాశాన్ని ఐదుగురు వ్యక్తులు తమ ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఖాళీ ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో బాటిళ్లలో చీప్ లిక్కర్ మందు పోసి ఫేక్ ఫారిన్ లిక్కర్ మందు అమ్ముతున్నారు.
ఇలా ఫేక్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లు అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ లిక్కర్ బాటిళ్లను రవాణా చేస్తున్నారనే సమాచారం అందుకున్న శంషాబాద్ ఎక్సైజ్ డిస్ర్టిక్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులతో కలిసి బుధవారం ఉదయం గచ్చిబౌలి ఇందిరానగర్ వద్ద రూట్‌వాచ్ నిర్వహించారు. ఈ సమయంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను చెక్ చేయగా15 నకిలీ ఫారిన్ గ్లెన్లివెట్ మద్యం బాటిళ్లు దొరికాయి.
ఈ మద్యం బాటిళ్లు తరలిస్తున్న కేపిహెచ్బీకి చెందిన ప్రకాష్‌గౌడ్(29), మాదాపూర్‌కు చెందిన భరత్(32)లను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశ్‌గౌడ్ నివాసం ఉంటున్న రూంలో తనిఖీ చేపట్టగా 46 ఫేక్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లు( బ్లూ లేబుల్, అమృత్, చివాస్, విలియం లాసన్, దివార్స్, టెక్విలా, గ్లెన్‌ఫిడిచ్) దొరికాయి. అనంతరం ప్రకాశ్ గౌడ్ ఇచ్చిన సమాచారంతో కొండాపూర్‌లోని మృత్యంజయ మహంతి ఇంటిపై, మాదాపూర్‌లోని విక్రమ్ భాయ్ ఇండ్లపై రైడ్ చేసి 78 ఫేక్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రకాశ్‌గౌడ్‌కు ఈ ఫారిన్ లిక్కర్ బాటిళ్ల దందాలో సహకరిస్తున్న అతని సోదరుడితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో చీప్ లిక్కర్ పోసి అమ్ముతుండ్రు..
బీర్ కంపెనీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తు ప్రకాష్‌గౌడ్ లిక్కర్ బిజినేస్‌లో తనకు పరిచయం ఉన్న భరత్, మృత్యంజయ మహంతి, విక్రమ్ భాయ్‌లతో గ్యాంగ్‌గా ఏర్పడి ఈవెంట్లలో తాగి వదిలేసిన ఫారిన్ లిక్కర్ బాటిళ్లను సేకరిస్తారు. సేకరించిన ఈ బాటిళ్లలో అఫీసర్స్ చాయిస్, ఒక్స్మిత్ వంటి లోకల్ మందును నింపి గుర్తుపట్టకుండా సీల్ వేస్తారు. అనంతరం ఈ ఫారిన్ లిక్కర్ బాటిళ్లను ఈవెంట్లలో తమకు గిఫ్ట్‌గా వచ్చాయని చెప్పి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దాదాపు 2 నెలలుగా ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో చీప్ లిక్కర్ పోసి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుండి రూ. 8 లక్షల విలువైన139 ఫేక్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లు, 136 ఖాళీ ఫారిన్ లిక్కర్ బాటిళ్లు, మూడు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు
