నకిలీ ప్రొఫైల్స్.. క్లిక్ చేశారో అంతే సంగతులు
పెరుగుతున్న సోషల్ మీడియా మోసాలు
నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తత అవసరం..
మనిషి జీవితంలో ప్రస్తుతం సోషల్ మీడియా ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ వచ్చి చేరడంతో సోషల్ మీడియాకి మనుషులు బానిసలుగా మారుతున్నారు. సోషల్ మీడియా వలన ఎంత మేలు జరుగుతుంతో అంతే నష్టం కూడా జరుగుతుంది. సామాజిక మాధ్యమాల రాకతో వేగవంతమైన సమాచార మార్పిడి, కనెక్టివిటీ, సంబంధాల నిర్వహణకు ఉపయోగపడుతున్నప్పటికీ, నకిలీ ప్రొఫైల్‌ల కారణంగా వ్యక్తిగత గోప్యత, భద్రత, ఆర్థికపరమైన సవాళ్లు విసురుతున్నాయి.

ఇటీవల ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికల్లో నకిలీ ఖాతాలను సృష్టించి, వ్యక్తులు, ప్రముఖులు, సంస్థలు, ప్రభుత్వ విభాగాల పేర్లు, అధికారుల ఫోటోలు, అధికారిక లోగోలను దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఉదంతాలు మనం తరచూ చూస్తూన్నాం. డిజిటల్ మాధ్యమాల్లో లభ్యమయ్యే వ్యక్తిగత సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అత్యవసరంగా డబ్బు కావాలని కోరడం, నకిలీ వ్యాపార ఒప్పందాలు, తక్కువ వడ్డీకే తక్షణ రుణాలు ఇస్తామని నమ్మించడం, ఉద్యోగాలు లేదా పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు..
సామాజిక మాధ్యమాల్లో మీకు వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరించే ముందు ప్రొఫైల్ నిజమైనదో కాదో నిర్ధారించుకోవాలి. మీ స్నేహితులు లేదా బంధువుల పేరుతో అత్యవసరంగా డబ్బు అడిగితే, నేరుగా వారికి ఫోన్ చేసి నిర్ధారించుకోవడం మంచిది.
బ్యాంకింగ్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు మీ బ్యాంక్ వివరాలు, పిన్ నంబర్లు లేదా OTPలను ఫోన్ లేదా ఆన్లైన్లో కోరవు. వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడులు, ఉద్యోగాలు లేదా తక్కువ వడ్డీకే రుణాలు అంటూ వచ్చే ఆఫర్లకు మోసపోవద్దు.
అపరిచిత ఖాతాల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు లేదా సందేశాలను నమ్మవద్దు. వ్యక్తిగత వివరాలు ఇవ్వడం, వీడియో కాల్లలో చేరడం, ఫోటోలు లేదా డాక్యుమెంట్లు పంపడం సమస్యలకు దారితీయవచ్చు.
అతి తక్కువ ధరలకు వస్తువులు లేదా వాహనాలు అమ్ముతామని చెబితే అప్రమత్తంగా ఉండాలి. మీ ఆశ నే మోసగాళ్ల పెట్టుబడి. అడ్వాన్స్ చెల్లింపులు లేదా ప్రాసెసింగ్ ఫీజులు అడిగితే వెంటనే తిరస్కరించాలి.
OTPలు, బ్యాంక్ వివరాలు, UPI సమాచారం, ఆధార్ లేదా పాన్ వివరాలను ఎవరికీ ఇవ్వకూడదు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు; తెలియని ఫైళ్లను డౌన్లోడ్ చేయకూడదు.
ప్రతి సోషల్ మీడియా ఖాతాకు బలమైన పాస్వర్డ్ ఉపయోగించాలి. ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్వర్డ్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రైవసీ సెట్టింగ్స్, టూ-స్టెప్ వెరిఫికేషన్ అమలు చేయాలి.
ప్రొఫైల్, ప్రొఫైల్ ఫోటోలను లాక్ చేసుకోవడం ఉత్తమం. అనుమానాస్పద, నకిలీ ఖాతాలను వెంటనే బ్లాక్ చేసి, సంబంధిత సోషల్ మీడియా వేదికలో రిపోర్ట్ చేయాలి.
సోషల్ మీడియాలో వ్యక్తిగత, ఆర్థిక సమాచారం లేదా ప్రయాణ వివరాలను బహిరంగంగా పోస్ట్ చేయకపోవడం మంచిది. ఏదైనా సంస్థ పేరుతో పెట్టుబడి ప్రతిపాదనలు వస్తే, ఆ సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలి.
కంప్లైంట్ చేయాలి ఇలా…
సైబర్ మోసాలకు గురైన వారు లేదా అనుమానాస్పద నకిలీ ఖాతాలను గమనించిన వారు ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయాలి. లేదా www.cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేయాలి. సమీప పోలీస్ స్టేషన్‌ను కూడా సంప్రదించవచ్చు.
సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ / తొలి గంటలో ఫిర్యాదు చేయడం ద్వారా ఆర్థిక నష్టాన్ని తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
