శేరిలింగంపల్లి జోన్లో ట్రాన్స్ఫర్లు లేని కంప్యూటర్ అపరేటర్
ఉద్యోగుల సంఘం నాయకురాలు, ప్రజాప్రతినిధుల లీడర్ అండా
రాజకీయ, ఉన్నతాధికారుల పలుకుబడితో చెలరేగిపోతున్న వైనం
అతనిపై అలా ఫిర్యాదు.. చేస్తే ఇలా తెలిసిపోతుంది
చందానగర్ టౌన్ ప్లానింగ్‌పై ప్రత్యేక కథనం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి వెస్ట్ జోన్ శేరిలింగంపల్లి నుండే అత్యధిక ఆదాయం సమకూరుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ జోన్లో ఎంత ఆమ్దానీ ఉంటుందో. ముఖ్యంగా వెస్ట్ జోన్‌లోని రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టింగ్‌లు సంపాధించుకోవడానికి అధికారులు లక్షలు సమర్పిస్తారు.
అలాంటి ఈజోన్లోని చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమార్జనకు అలవాటు పడ్డ ఓ ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ సర్కిల్ అఫీస్ను అంటిపెట్టుకొనే ఉంటున్నాడు. అధికారులు, సిబ్బందికి ట్రాన్స్ఫర్లు చేస్తున్న ఉన్నతాధికారులు ఈ కంప్యూటర్ అపరేటర్‌ను మాత్రం టచ్ చేయలేకపోతున్నారు.
దీనికి ముఖ్య కారణం అతనికి ఉద్యోగుల సంఘం నాయకురాలు అండ్ అధికారిణి, ప్రభుత్వంలో అత్యున్నత పదవిలో ఉన్న వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండయే కారణమని తెలుస్తోంది. జోనల్ అధికారులు, సర్కిల్ అధికారులు కానీ ఇతనిపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు అని తెలిస్తే చాలు వెంటనే సదరు ఉద్యోగుల సంఘం నాయకురాలు, లేదా రాష్ర్ట స్థాయి ప్రజాప్రతినిధితో మాట్లాడించి తనపై చర్యలు చేపట్టకుండా ఒత్తిడి తీసుకువస్తాడు.
అలా ఫిర్యాదు చేస్తే.. ఇలా తెలిసిపోతుంది
శేరిలింగంపల్లి జోన్ కార్యాలయం, చందానగర్ సర్కిల్ కార్యాలయాల్లో సదరు ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ అపరేటర్ ఆగడాలపై సర్కిల్ ఉన్నతాధికారులు, జోనల్ ఉన్నతాధికారులకు బాధితులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే చాలు.. క్షణాల్లో ఫిర్యాదులు చేసిన వారికి కంప్యూటర్ అపరేటర్ నుండి ఫోన్ కాల్స్ వస్తాయి.
తనపై ఎందుకు ఫిర్యాదు చేశారు ? ఏం కావాలి అంటూ బెదరగొడుతాడు. ఈ సంఘటనతో తాము ఫిర్యాదు చేసిన విషయం అతనికి ఏ విధంగా తెలిసింది అంటూ బాధితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సదరు కంప్యూటర్ అపరేటర్‌కు జోనల్ కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి తనపై ఏలాంటి ఫిర్యాదులు వచ్చిన వెంటనే తనకు చెప్పాలని మ్యానేజ్ చేసుకున్నట్లు తెలిసింది.
శేరిలింగంపల్లి జోన్ అఫీస్తో పాటు శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిల్ కార్యాలయాల్లో ‘‘గడ్డం సీనన్న’’ అంటే తెలియని వారు ఉండరు. అతను పెద్ద అఫీసర్ అని అనుకుంటే మీరు మురుగునీటిలో కాలువేసినట్లే. అతను చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం చేసే సాధారణ కంప్యూటర్ అపరేటర్. అతని పేరు అంతలా మారుమోగిపోవడానికి కారణం అక్రమ నిర్మాణాల వద్ద డబ్బులు వసూళ్లు చేయడంలో దిట్ట అనే పేరుంది.
ఎంత పెద్ద బిల్డర్ అయినా, అతని వెనుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా సరే.. ముక్కు పిండి వసూళ్లు చేస్తాడనే పేరుంది. తాను పనిచేసే అఫీస్‌లో ఎంత పెద్ద అధికారి అయినా సరే తన బుట్టలో వేసుకొని తన పనికి అడ్డు రాకుండా చేసుకుంటాడు అని అతని అఫీస్ ఉద్యోగులు చెబుతున్నారు. వసూళ్లు చేసిన వాటిలో కింది స్థాయి నుండి ఉన్నతాధికారి వరకు మామూళ్లు పంపిస్తాడు. అందుకే అతనిపై ఎవరు చర్యలు తీసుకోవడానికి ముందుకురారు వాదనలున్నాయి.
