జీహెచ్ఎంసీ విస్తరణకు ఒకే చెప్పిన కేబినెట్
ఔటర్‌కు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీలోనే..
మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు..
వార్తమ్యాన్, హైదరాబాద్ : ఔటర్ రింగు రోడ్డుకు అనుకొని ఉన్న మున్సిపాలటీలను అన్నీంటిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ర్ట కేబినెట్ ఒకే చెప్పంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు… పెద్ద అంబర్ పేట్, జల్‌పల్లి, తుర్కయంజాల్, శంషాబాద్‌లు, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, దమ్మాయి గూడ, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జీగీర్, మీర్‌పేట్, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం కాబోతున్నాయి.
ఇందుకోసం జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని నిర్ణయించింది. మంత్రిమండలి నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు ఇవే..
హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు రూ. 14,725 కోట్ల ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసిన మంత్రి మండలి, నగరంలో విద్యుత్ సర్కిళ్ల వారిగా మూడు విభాగాలుగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ రెండు డిస్కమ్‌లతో పాటు కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటుకు మంత్రి మండలి ఒకే చెప్పింది. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచి నీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి వస్తాయి.
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, ఉత్పత్తి అంచనాలను పరిగణలోకి తీసుకుని పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం, రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలని నిర్ణయించింది.
అందులో భాగంగా 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 3 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని, సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచడానికి 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 2 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలనిడి కేబినెట్ సైడ్ చేసింది.
పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. ఇప్పటికే డిస్కమ్‌ల వద్ద ఉన్న ఎంఓయూలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకోన్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయం. అందుకు ఆసక్తిని వ్యక్తీకరించే కంపెనీలకు అవసరమైన భూమి, నీటిని ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ముందుగా రాష్ట్ర డిస్కమ్‌లకే అమ్మాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.
రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ లో కొత్త పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించడం.
కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలి. ఇందులో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు.
రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఎన్టీపీసీ అధ్వర్యంలో చేపట్టాలి. పాల్వంచ, మక్తల్‌లోనూ ఎన్టీపీసీ అధ్వర్యంలో విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థల కేటాయింపుకు మంత్రి మండలి నిర్ణయం.
ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. రాష్ట్రంలో 56 ఏటీసీలకు అదనంగా జూబ్లీహిల్స్‌తో పాటు రాష్ట్రంలో కొత్తగా 6 ఐటీఐలను ఏటీసీలుగా మార్పు.
