చైనా మాంజాతో పతంగి ఎగరవేస్తున్నారా ? ప్రాణాలు పోతున్నాయి జాగ్రత్త
1 min read

చైనా మాంజాతో పతంగి ఎగరవేస్తున్నారా ? ప్రాణాలు పోతున్నాయి జాగ్రత్త

 

సరదా కోసం ఎగరవేసే పతంగుల మాంజాతో ప్రమాదం..

మృత్యుపాశంగా మారుతున్న చైనా మాంజాలు..

విచ్చిలవిడిగా చైనా మాంజాలు విక్రయం..

తూతూమంత్రంగా పోలీసుల తనిఖీలు

 

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో నగర వీధుల్లో చైనా మాంజా మృత్యువు రూపంలో దూసుకువస్తుంది. నిషేదం ఉన్నా కూడా వ్యాపారులు అక్రమ మార్గంలో చైనా మాంజాను మార్కెట్​లో విచ్చలవిడిగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ మాంజాతో నగర ప్రజలు పతంగులు ఎగరవేస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు సిటీ రోడ్లపై ప్రయాణించాలంటే బెంబేలెత్తిపోతున్నారు.

 

బైకులపై, నడుచుకుంటూ వెళ్తే ప్రజలకు ఈ చైనా మాంజా ప్రాణసంకటంగా మారుగుతుంది. పక్షులు కూడా ఈ మాంజాకి చిక్కి ప్రాణాలో కోల్పోతున్నాయి. చైనా మాంజాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా అమ్మితే కేసులు నమోదు చేస్తామని చెబుతున్న పోలీసుల మాటలు కేవలం ప్రకటనల వరకే సరిపోతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చైనా మాంజా మెడకు తగలడంతో కట్​ అయిన జశ్వంత్​రెడ్డి మెడ
జశ్వంత్​రెడ్డి

 

 మెడకు ఉరితాడుగా మారుతున్న చైనా మాంజా

 

​సాధారణ నూలు దారానికి భిన్నంగా, చైనా మాంజాను నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారు చేసి, దానిపై గాజు పొడి, లోహపు ముక్కల పూత పూస్తారు. ఇది ఎంత పదునుగా ఉంటుందంటే. గాలిలో వేలాడుతున్న ఈ దారం బైక్‌పై వెళ్లే వారి గొంతుకు తగిలితే క్షణాల్లో లోతైన గాయాలవుతున్నాయి. గాల్లో ఎగిరే పక్షులకు మాంజాతాడు తట్టి ప్రాణాలు కోల్పోతున్నాయి.

హైటెక్​సిటీలోని ఓ ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బైక్​పై పని నిమిత్తం లింగంపల్లి మార్కెట్​ రోడ్డులో వెళ్తుండగా మెడకు చైనా మాంజా తగిలింది. మార్కెట్​లో రద్దీ ఉండడం, తక్కువ వేగంతో వెళ్తుండగా పెను ప్రమాదం తప్పింది. ఆ కానిస్టేబుల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

 

కీసరలో మల్లికార్జున నగర్ కాలనీలో నివాసం ఉండే పినింటి సుధాకర్ రెడ్డి కొడుకు జశ్వంత్​రెడ్డి బైక్​పై వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా మెడకు మాంజా చుట్టుకొని గొంతు లోపలికి తెగింది. కీసర నితిన్ హాస్పటిల్లో జశ్వంత్​రెడ్డి మెడకు 19 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

తాజాగా హైదరాబాద్​ శంషీర్​గంజ్​ ప్రాంతంలో బైక్​పై వెళ్తున్న నవాబ్​సాహెబ్​కుంట ప్రాంతానికి చెందిన జమీల్​ అనే యవకుడి మెడకు చైనా మాంజా తగిలి గొంతు కోసుకుపోయింది. గొంతు తెగడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. గతంలో ఇదే మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

 

​విచ్చలవిడిగా విక్రయాలు

 

ప్రమాదకర చైనా మాంజాను ప్రభుత్వం పూర్తిగా నిషేదం విధించింది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నిషేదం ఉన్నా కూడా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు అక్రమ మార్గంలో చైనా మాంజాను మార్కెట్​లో విక్రయాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేట, మంగళ్‌హాట్, బేగంబజార్ వంటి ప్రాంతాల్లో రహస్యంగా అమ్ముతున్నారు. శేరిలింగంపల్లిలోని లింగంపల్లి మార్కెట్​ ప్రాంతంలో కూడా చైనా మాంజాను బహిరంగంగా అమ్ముతున్నారు.

 

పోలీసుల తనిఖీలు తూతూ మంత్రంగానే

 

నిషేదం ఉన్న చైనా మాంజాను విచ్చలవిడిగా అమ్ముతున్న షాపులపై పోలీసులు నిఘా పెట్టాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మార్కెట్​లో ఇష్టానుసారంగా చైనా మాంజాను అమ్ముతున్నా పోలీసులు అప్పుడప్పుడు కొన్ని దుకాణాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, ప్రధాన హోల్‌సేల్ సరఫరాదారులపై నిఘా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు తూతూ మంత్రంగానే తనిఖీలు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

 

చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తా.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

 

చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ విచారణ వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజాను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ షాపులో అయిన చైనా మాంజా అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే , విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని… వారికి తన నుండి 5 వేల నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ ప్రకటించారు