అన్నమయ్య పదార్చన.. తందనాన స్వరార్చన
ఘనంగా అంతర్జాతీయ సంగీత పోటీల గ్రాండ్ ఫైనల్స్
పదకవితా పితామహుడి సంకీర్తనలు నేటి తరం గళంలో నవ రాగాలై ప్రతిధ్వనించాయి. భక్తి భావం పరిమళించిన వేదికపై ‘తందనాన – అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీలు 2025’ గ్రాండ్ ఫైనల్స్ అంగరంగ వైభవంగా సాగాయి. హైటెక్స్ సమీపంలోని అన్నమాచార్య భావన వాహిని (ఏబీవీ) ప్రాంగణం ఒక దివ్య క్షేత్రాన్ని తలపించింది. పద్మశ్రీ డాక్టర్ శోభారాజు ఆశయం ప్రతి స్వరంలోనూ ప్రతిబింబించింది.
ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయనిర్ణేతలుగా సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, నేపథ్య గాయకులు సునీత ఉపద్రష్ట, గాయత్రి ఉన్నారు. అన్నమాచార్య భావన వాహిని వ్యవస్థాపకులు, అధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు తాళ్లపాక అన్నమాచార్య దివ్య సంకీర్తనలను ప్రపంచవ్యాప్తం చేయాలన్న ఆమె జీవిత లక్ష్యంలో భాగంగా సాగింది. ఈ కార్యక్రమానికి 500కు పైగా సంగీత ప్రియులు హాజరయ్యారు.
గ్రాండ్ ఫైనల్స్‌లో వివిధ విభాగాలలో విజేతలు.. సబ్ జూనియర్ (6 సంవత్సరాల లోపు) విభాగంలో భట్టిప్రోలు మేఘన, జూనియర్ (7-15 సంవత్సరాలు) విభాగంలో చిర్పల్లి శ్రీ మహాలక్ష్మి, సీనియర్ (16 సంవత్సరాలు, పైబడినవారు) విభాగంలో సముద్రాల లక్ష్మీ హరి చందన విజేతలుగా నిలిచారు. విజేతలుగా నిలిచిన వారికి స్వర్ణ పతకాలు అందజేశారు.
