ఉన్నత చదువులు చదివేందుకు పేద విద్యార్థికి హెల్ప్ చేసిన లయన్స్ క్లబ్
ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివేందుకు ఆ విద్యార్థికి అవకాశం వచ్చింది. కానీ అంత దూరం వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ పేద విద్యార్థికి ఆర్థిక చేయూతనందించేందుకు లయన్స్ క్లబ్ సభ్యులు ముందుకు వచ్చారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే పి వివేకానంద చేతుల మీదుగా సోమవారం ఆ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేశారు.
సూరారం కాలనీ 60 గజాలకి చెందిన శ్రీపతి ఉదయ్ కుమార్కు ఆస్ట్రేలియాలో మైక్రో బయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవకాశం వచ్చింది. సదురు విద్యార్థి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో సహాయం కోరుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి. వివేకానందను ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ సభ్యులకు సమాచారం అందించారు.
ఈ మేరకు లయన్స్ క్లబ్ సభ్యులు రూ. 1.30 లక్షలను జమ చేసి సోమవారం ఉదయం ఎమ్మెల్యే చేతుల మీదుగా సదరు విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ… తాను కోరిన కేవలం రెండు రోజుల్లోనే విద్యార్థికి అండగా నిలిచేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థులకు, సామాన్యులకు ఎప్పుడు అండగా ఉండాలని కోరారు.
నియోజకవర్గంలో అందరూ పేద విద్యార్థులకు వైద్య విద్య, ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసేందుకు ఆర్థికపరంగా ఆదుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ అధ్యక్షులు బిర్రు ఆంజనేయులు, డిస్టిక్ మాజీ గవర్నర్ విజయ్ కుమార్ శెట్టి, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు చల్లా శ్రీనివాస్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, కోలా వెంకటేష్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహులు గౌడ్, బాలరాజు, ప్రవీణ్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
