మార్చిలో పదవ తరగతి పరీక్షలు… అంతలోనే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
మార్చి నెలలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్‌లో జరిగింది. బీదర్ రాష్ర్టం బాల్కి గ్రామానికి చెందిన రేవల సిద్ధయ్య భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఓల్డ్ హఫీజ్‌పేట్‌లోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు.
సిద్ధయ్య ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, పెద్ద కుమారుడు స్థానికంగా ఉన్న డీమార్ట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ కుమారుడు శంకర్ సొంతూరిలో గత సంవత్సరం పదవ పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడు. దీంతో మార్చి నెలలో పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యాడు. గత కొద్ది రోజులుగా సిద్ధయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా భార్య, పెద్ద కుమారుడు సిద్ధయ్యను చికిత్స కోసం బీదర్‌కు తీసుకువెళ్లారు.
ప్రస్తుతం ఇంటి వద్ద శంకర్, అతని బంధువు లింగయ్య ఇద్దరు ఉంటున్నారు. లింగయ్య కూకట్‌పల్లిలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం లింగయ్యను కాలేజీ వెళ్లేందుకు శంకర్ బైక్‌పై మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద డ్రాప్ చేశాడు. కాలేజీకి లేట్‌గా రావడంలో లింగయ్యను కాలేజీ లోపలికి రానియ్యకపోవడంతో తిరిగి మెట్రోలో మియాపూర్‌కు చేరుకొని శంకర్‌కు కాల్ చేశాడు.
శంకర్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో నిద్ర పోయాడనుకొని లింగయ్య ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న శంకర్ ఎంతకు డోర్ ఓపెన్ చేయకపోవడంతో కిటికిలో నుండి లోపలికి చూడగా శంకర్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. స్థానికుల సహాయంతో లింగయ్య ఇంటి డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే శంకర్ చనిపోయి ఉన్నాడు.
సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పదవ పరీక్షల్లో తిరిగి ఫెయిల్ అవుతానేమోనని శంకర్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
