హిట్ అండ్ రన్లో ప్రాణాలో పోకుండా కాపాడటమే తమ లక్ష్యం…
ఇటీవల వరుస హిట్ అండ్ రన్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఫుట్‌పాత్‌లపై నిద్రస్తున్న బిక్షాటనదారుల రక్షణే లక్ష్యంగా మియాపూర్ పోలీసులు మానవీయ పోలీసింగ్‌కు ఉదాహరణగా నిలిచారు.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో హిట్ అండ్ రన్ ఘటనలు నమోదవుతున్న పరిస్థితిని గమనించిన పోలీసులు, ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న భిక్షాటనదారుల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ముందే అంచనా వేసి, రోడ్డు ప్రమాదాలు నివారించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రివెంటివ్ డ్రైవ్ నిర్వహించారు.
మియాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ పర్యవేక్షణలో మియాపూర్ పోలీస్ సిబ్బంది సమన్వయంతో నిర్వహించి, ఉదయం వేళల్లో ఫుట్‌పాత్‌లపై నివసిస్తూ నిద్రిస్తున్న భిక్షాటనదారులను గుర్తించి వారి భద్రత, సంక్షేమాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలేటి అటమ్ వరల్డ్ ఆశ్రమానికి సురక్షితంగా తరలించారు.
మొత్తం 22 మంది భిక్షాటన చేసేవారిని ఆశ్రమానికి చేర్చి, వారికి తాత్కాలిక నివాసం, ఆహారం, సంరక్షణ లభించేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళల్లో వేగంగా ప్రయాణించే వాహనాల కారణంగా ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న నిరాశ్రయుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
పోలీసులంటే కేవలం శాంతి భద్రతల వరకే పరిమితం కాదంటూ.. ప్రజల ప్రాణాల పట్ల పోలీస్ శాఖకు ఉన్న బాధ్యత, మానవీయ దృక్పథం, ముందస్తు ఆలోచనకు నిదర్శనంగా నిలుస్తోందని, ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్‌తో పాటు మియాపూర్ పోలీస్ సిబ్బంది చూపిన చొరవను స్థానిక ప్రజలు, వాహనదారులు, పౌరులు ప్రశంసిస్తున్నారు
