ఉప్పల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వర్సెస్ లియోనల్ మెస్సీ.. గోల్ కొట్టి మ్యాచ్ గెలిపిన సీఎం
వరల్డ్ ఫుట్‌బాల్ స్టార్ లియోనాల్ మెస్సీ హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. గోట్ టూర్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లో కొనసాగుతుంది. గోట్ కప్ పేరుతో ఉప్పల్ వేదికగా జరిగిన ఎగ్గిబిషన్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. అపర్ణ మెస్సీ టీమ్, సింగరేణి ఆర్ఆర్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సింగరేణి జట్టు గెలుపొందింది. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరుఫున సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగి గోల్ సాధించడంతో ఉప్పల్ స్టేడియం మారుమోగింది. మ్యాచ్ అనంతరం విజేతకు మెస్సీ ట్రోఫీని బహూకరించారు. ఈ మ్యాచ్ చూడటానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.

సింగరేణి ఆర్ఆర్ జట్టు తరుఫున సీఎం రేవంత్ రెడ్డి.. అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ నుంచి ఫుట్‌బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సీ గ్రౌండ్‌లోకి దిగడం అభిమానులను ఉర్రూతలూగించింది. శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ ఫుట్ బాల్ మ్యాచ్‌లో.. ప్రారంభంలోనే సింగరేణి ఆర్ఆర్ జట్టు వరుసగా రెండు గోల్స్ సాధించింది. మ్యాచ్ 18వ నిమిషంలో గ్రౌండ్లో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి వచ్చీ రావటంతోనే గోల్ కొట్టి అలరించారు. దీంతో అభిమానుల కేరింతలతో ఉప్పల్ స్టేడియం మార్మోగింది.

లియోనాల్ మెస్సీ కూడా గ్రౌండ్లోకి దిగి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సరదాగా కాసేపు ఫుట్ బాల్ ఆడారు. మ్యాచ్ పూర్తైన తర్వాత సింగరేణి ఆర్ఆర్ జట్టుకు మెస్సీ ట్రోఫీని అందజేశారు. అలాగే అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రోఫీని అందించారు. మ్యాచ్ సందర్భంగా మెస్సీ, రోడ్రిగో, సీఎం రేవంత్ రెడ్డి స్టేడియంలో చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. మరోవైపు తమ అభిమాన క్రీడాకారుణ్ని చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మ్యాచ్ సందర్భంగా తెలంగాణ గురుకుల పాఠశాలల విద్యార్థులతో మెస్సీ ముచ్చటించారు. గురుకుల పాఠశాలల నుంచి వచ్చిన నాలుగు జూనియర్ టీమ్స్‌తో మాట్లాడిన మెస్సీ, వారికి ఫుట్‌బాల్ మెళకువలు అందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ కుమారుడు, కుమార్తె హాజరై మ్యాచ్‌ను చూశారు.

మెస్సి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సింగ్ రాహుల్ సుప్లిగంజ్ పాడిన నాటు నాటు పాట ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. మంగ్లీ, రాహుల్ ఇద్దరూ కలిసి తెలంగాణ ఫోక్ సాంగ్స్ పాడి ఆకట్టుకున్నారు. మ్యాచ్ అనంతరం మెస్సి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫలక్‌నూమ ప్యాలెస్‌కు చేరుకున్నారు. శనివారం రాత్రి ప్యాలెస్‌లోనే బస చేయనున్న మెస్సీ, ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో శంషాబాద్ నుండి ముంబైకి బయలుదేరి వెళ్లాడు.
