భయపడకండి.. మీ ఇండ్ల జోలికి రాము.. ఆ కాలనీలకు భరోసానిచ్చిన హైడ్రా
మీరు ఏలాంటి భయాందోళన చెందవద్దు. మీ కాలనీలలోకి హైడ్రా వచ్చి మీరు ఉంటున్న ఇండ్లను కూల్చివేయదు. మీరు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ వివాదాస్పద సర్వే నెంబర్ 44లోని పలు కాలనీవాసులకు హైడ్రా భరోసానిచ్చింది. దీంతో ఆయా కాలనీ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు రోజులు హైడ్రా తమ ఇండ్లను కూల్చివేస్తుందేమోనని కంటి మీద కునుకు లేకుండా గడిపిన కాలనీవాసులకు సంక్రాంతి పండుగ సందర్భంగా హైడ్రా తీపికబురు అందించింది.
శేరిలింగంపల్లి మండలం మియాపూర్ మక్తా మహబూబ్‌పేట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 44లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిపై ప్రస్తుతం హైకోర్టు, సుప్రీం కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లోనే రెడ్డికాలనీ, నాగార్జున ఎన్‌క్లేవ్, బీకే ఎన్‌క్లేవ్‌తో పాటు పలు కాలనీలు వెలిసాయి. అనేక మంది ప్రజలు ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. ఇటీవల హైడ్రా అధికారులు ఈ సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టింది. ప్రధాన రహదారి వెంబడి భూమిని కబ్జా చేసి నిర్మించిన షెడ్లను తొలగించింది.
హైడ్రా అధికారులు తమ కాలనీలలో ఇండ్లను కూడా కూల్చివేస్తారేమోనని భయాందోళన చెందారు. గత రెండు రోజులుగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై హైడ్రా అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సర్వే నెంబర్ 44లో తప్పుడు పత్రాలు సృష్టించి వాణిజ్య సముదాయాలు నిర్మించిన ఆక్రమణదారుల పట్ల కఠినంగా ఉంటామని హైడ్రా తెలిపింది. సర్వే నంబరు 44లో మొత్తం విస్తీర్ణం 260.01 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, సేత్వార్ గ్రామ రికార్డుల ప్రకారం మొత్తం విస్తీర్ణం ప్రభుత్వ స్థలంగా గుర్తించడమైందని హైడ్రా అధికారులు తెలిపారు.
ఈ సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో ఇప్పటికే చాలావరకు ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఆ ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లడం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇక్కడ తప్పుడు పత్రాలను సృష్టించి ఎకరాలకొద్దీ ఆక్రమణలకు పాల్పడిన వారు నివాసితులను తప్పుదోవ పట్టిస్తున్నారనే సమాచారం ఉందన్నారు. అక్రమణదారుల స్థలాలు, వాణిజ్య సముదాయాలను కాపాడుకునేందుకు నివాసితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని హైడ్రా అధికారులు నివాసితులకు హెచ్చరించారు. ఆక్రమణలను ఆపడం కోసమే ఇక్కడ ఫెన్సింగ్ వేస్తున్నామని హైడ్రా స్పష్టం చేశారు.
15 ఎకరాల భూమికి ఫెన్సింగ్ పూర్తి

తప్పుడు పత్రాలతో సర్వే నెంబర్ 44లోని స్థలానికి రిజిస్ట్రేషన్ జరగడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. ఇప్పటికే అక్కడ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన సబ్ రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలోనే సర్వే నంబరు 44లో మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు బీకే ఎన్‌క్లేవ్ చెరువు పక్కన ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇదివరకే కాపాడి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. తాజాగా శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు సర్వే నంబరు 44లోని 15 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేసింది.
హైడ్రా ఏర్పాటకు ముందు నిర్మించిన ఇళ్లను తొలగించరాదని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, ఇదే నిబంధన అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడ అక్కడ ఆక్రమణలకు పాల్పడిన దుకాణదారులు, షోరూంలను అద్దెలకు ఇచ్చిన బడాబాబులు ప్రతి నెలా రూ. లక్షలు అద్దెలు వసూలు చేస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చిందన్నారు. తమ ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను, వ్యాపారాలను కాపాడుకోడానికి అక్కడి నివాసితులలో లేని పోని భయాలను సృష్టించి పావులుగా వాడుకుంటున్నారని, ఈ విషయాన్ని అక్కడి నివాసితులు గ్రహించాలని హైడ్రా అధికారులు కోరారు.
