అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్నారా ?  తస్మాత్​ జాగ్రత్త..
1 min read

అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్నారా ? తస్మాత్​ జాగ్రత్త..

  • రోడ్డు వెంట వెళ్తున్న పాదచారిపై కర్రలతో దాడి చేసి దారి దోపిడీ
  • చికిత్స పొందుతూ పాదచారి మృతి


హైదరాబాద్​ రోడ్లపై అర్ధరాత్రి వేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారా ? తస్మాత్​ జాగ్రత్త. కొందరూ అకతాయిలు బైకులపై తిరుగుతూ రోడ్డు వెంట ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్​గా చేసుకొని దారి దోపిడికి పాల్పడుతున్నారు. వారికి అడ్డు చెబితే అంతే సంగతులు. తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు.

ఇటీవల ఐటీ కారిడార్​లో రోడ్డు వెంట అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఓ పాదచారిపై నలుగురు యువకులు కర్రలతో దాడి చేసి అతని వద్ద ఉన్న సెల్​ఫోన్​, నగదును ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ ఆ పాదచారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దాడి చేసిన నలుగురు యువకులను గుర్తించి అరెస్ట్​ చేశారు. అయితే ఈ దాడికి పాల్పడ్డ వారిలో ఇద్దరు మైనర్​ బాలురు కూడా ఉండడం విశేషం.

బీహార్​ రాష్ర్టం మధుబనీ ప్రాంతానికి చెందిన సౌరభ్​కుమార్​(24) కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చి రాయదుర్గం ప్రశాంత్​నగర్​కాలనీలో నివాసం ఉంటున్నారు. సౌరభ్​కుమార్​ స్థానికంగా సీసీటీవి టెక్నీషియన్​గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. టోలిచౌకి హకీంపేట్​లో నివాసం ఉండే మహ్మద్​ రేహన్​(19), మహ్మద్​ ఇబ్రహీం అహ్మద్​(19)లతో పాటు మరో ఇద్దరు మైనర్​ బాలురు చిన్న చిన్న పనులు చేసుకుంటూ అవారాగా తిరుగుతున్నారు. అర్దరాత్రి బైకులపై తిరుగుతున్న ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారి వద్ద సెల్​ఫోన్లు, డబ్బులు దోపిడీ చేయాలని ప్లాన్​ చేసుకున్నారు.

ఈ నెల 10వ తేదిన అర్ధరాత్రి సౌరభ్​కుమర్ జూబ్లీహిల్స్​ రోడ్డు నెంబర్​ 45 నుండి రాయదుర్గం ప్రశాంతిహిల్స్​ కాలనీ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే రోడ్డులో రేహన్​, ఇబ్రహీం అహ్మద్​లు కలిసి పల్సర్​ బైక్​పై, ఇద్దరు మైనర్లు కలిసి డియో బైక్​ వెళ్తుండగా సౌరభ్​కుమార్​ తారసపడ్డాడు. దీంతో రేహన్​, ఇబ్రహీం అహ్మద్​లు సౌరభ్​ వద్ద బైక్​ అపి లిఫ్ట్​ ఇస్తామని చెప్పడంతో సౌరభ్​ వారి బైక్​ ఎక్కాడు. కొద్దిదూరం వెళ్లాక సౌరభ్​ను సెల్​ఫోన్​, డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించాడు. దీంతో సౌరభ్​ వారి బైక్​ దిగి, అసభ్య పదజాలంతో దూషించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. రోడ్డు వెంట వెళ్తున్న వారు అక్కడికి రావడంతో నలుగురు యువకులు అక్కడి నుండి బైకులతో పారిపోయారు.

అనంతరం ఓ హోటల్​లో కలుసుకున్న నలుగురు యువకులు తమకు జరిగిన అవమానంపై పగ తీర్చుకోవాలని డిసైడ్​ అయ్యారు. నలుగురు కలిసి రెండు బైకులపై సౌరభ్​కుమార్​ కోసం గాలిస్తూ, మార్గమధ్యంలో నిర్మాణ భవనం వద్ద సెంట్రింగ్​ కర్రలను వెంట పెట్టుకొని వెళ్తుండగా బీఎన్​ఆర్​ హిల్స్​ రోడ్డు వెంట లెథర్​ కంపెనీ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సౌరభ్​కుమార్ కనిపించాడు. దీంతో నలుగురు యువకులు కలిసి కర్రలతో సౌరభ్​పై విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం అతని వద్ద నుండి సెల్​ఫోన్​, డబ్బులు లాక్కొని అక్కడి నుండి పారిపోయారు.

స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న సౌరభ్​ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు సౌరభ్​ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే సౌరభ్​ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందగా, అతని సోదరుడు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌరభ్​ ఈ నెల 13వ తేదిన మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రేహన్​, ఇబ్రహీం అహ్మద్​లను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. మరో ఇద్దరు మైనర్​ బాలురను జువైనల్​ హోంకు తరలించారు.