బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువుకు ప్రాణం పోసిన హైడ్రా
నీటితో కలకలలాడుతున్ననిజాం కాలం నాటి చెరువు
నూతన సంవత్సరంలో చెరువు పున: ప్రారంభం
అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ నగరానికి ఒకప్పుడు మంచినీరు అందించిన చెరువు కాలక్రమేనా మురికికూపంగా మారిపోయాయి. దీనికి తోడు భూమి ధరకు రెక్కలు రావడంతో కబ్జాదారులు చెరువు స్థలాలను చెరబట్టారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా అందుబాటులోకి రావడంతో చెరువులు తిరిగి తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి.
పాతబస్తీలో నిజాంల నాటి చారిత్రక చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. కబ్జాలను తొలగించి, ఆక్రమణలతో ఆనవాళ్లే కోల్పోయిన చెరువును బతికించింది. చరిత్రను తవ్వితీసిన మాదిరి చెరువును రూపొందించి చారిత్రక వైభవాన్ని హైడ్రా చాటింది. ఇలా పాతబస్తీకే మణిహారంగా బమ్ -రుక్న్-ఉద్-దౌలా చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది.
సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన నూతన సంవత్సరంలో ఈ చెరువును ప్రారంభించడానికి హైడ్రా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న చరిత్రకు ప్రాణం పోస్తున్నామన్నారు.

ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా అక్కడ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులను ఆదేశించారు. చెరువుకు స్థానికులు సులభంగా చేరుకునేలా రహదారులతో పాటు ప్రవేశ ద్వారాలుండాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్‌పై వాకింగ్ ట్రాక్‌లను పరిశీలించారు.
చెరువు లోపలి వైపు ఫెన్సింగ్ పనులను పరిశీలించారు. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న ప్లే ఏరియాలను పరిశీలించారు. వృద్ధులు సేద దీరే విధంగా అక్కడ గజబోలు నిర్మాణాలు నలువైపులా ఉండేలా చూడాలన్నారు. పార్కులు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాట్లను పరిశీలించారు.
విహార కేంద్రంగా బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు
కాంక్రీట్ జంగిల్‌గా నగరాలు మారిపోతున్న వేళ పాతబస్తీలో నేషనల్ పోలీస్ అకాడమీకి చేరువలో అభివృద్ధి చేస్తున్న బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఔషధ గుణాలున్న వృక్ష జాతితో పాటు.. మొక్కలను చెరువు చుట్టూ నాటాలని సూచించారు. పచ్చిక బైళ్లతో పార్కులు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు.
బయటకు చెరువు పరిసరాల్లో ఉన్న ఉష్ణోగ్రతల్లో తేడా తెలిసేలా.. పచ్చని వాతావరణం ఉండేలా చూడాలన్నారు. నిజాంల కాలంలో చెరువు నిర్మాణంలో వాడిన రాతిని వినియోగించి కట్టడాన్ని పటిష్టం చేయాలన్నారు. ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్‌లు విశాలంగా ఉండేలా చేపట్టిన నిర్మాణాలను చూశారు.
రాజేంద్రనగర్, ఆరాంఘర్ ఇలా 10 కిలోమీటర్ల మేర చెరువుకు వర్షం నీరు వచ్చేలా ఇన్‌లెట్లు నిర్మించాలని.. ఈ ప్రాంతంలో వరద కష్టాలకు ఈ చెరువు చెక్‌పెట్టేలా చూడాలని సూచించారు. సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేస్తున్నారు.
చెరువు చరిత్ర ఇలా..
×1970లో మూడవ నిజాం సికందర్ జాహ్ పాలనలో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్ – ఉద్ – దౌలా ఈ చెరువును నిర్మించారని, అందుకే ఈ చెరువుకు బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువుగా పేరు మారిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తాగు నీటి అవసరాలను తర్చేలా 104 ఎకరాల మేర ఈ చెరువు విస్తరించి ఉందని నాటి రికార్డుల ప్రకారం తెలుస్తుంది.
కాలక్రమంలో చెరువు విస్తీర్ణం తగ్గుతూ హెచ్ ఎం డీ ఏ ఈ చెరువును 17.05 ఎకరాలుగా నిర్ధారించింది. చివరికి 4.12 ఎకరాలుగా మిగిలిపోయింది. హైడ్రా గత ఏడాది ఆగస్టులో ఆక్రమణలను తొలగించింది. హెచ్ ఎం డీ ఏ పేర్కొన్న విధంగా పూర్తి స్థాయిలో భూమి అందుబాటులోకి తెచ్చింది.
ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు అనేక అవరోధాలను అధిగమించి విమర్శలను ఎదుర్కొంది. అలా విమర్శించిన వారే ఔరా అనేట్టు హైడ్రా ఈ చెరువును అభివృద్ధి చేసింది. ఇప్పుడు స్థానికులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలలో కూడా ఊహించడం కష్టంగా ఉన్న ఈ ప్రాంతానికి ఇంత అందాన్ని తీసుకువచ్చిన హైడ్రాకు అభినందనలు తెలుపుతున్నారు.
అడుగడుగునా చారిత్రక ఆనవాళ్లు, ఎన్నో విశేషాలు స్థానికంగా ఉన్న వృద్ధులు పలు విధాలుగా వివరిస్తున్నారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువుకు చేరేదని చెబుతున్నారు. నిజాంల కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును రాణులు స్నానాలకు వినియోగించేవారని చెబుతున్నారు.
అలాగే బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి.. ఆ దిగువున నిర్మించిన బావిలోకి వచ్చిన ఊట నీటిని తాగేందుకు నిజాం పాలకులు వినియోగించేవారని మరి కొంతమంది వివరిస్తున్నారు. ఔషధగుణాలున్న ఈ నీటిని మాత్రమే నిజాంలు వినియోగించేవారంటున్నారు.
ఈ చెరువు చుట్టు సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి వినియోగించేవారని.. ఇందుకోసం అరబ్ దేశాలకు ఇక్కడి నీరు తీసుకెళ్లేవారంటున్నారు. ఇలా ఎంతో చరిత్ర ఉన్న ఈ చెరువు మళ్లీ పునరుద్ధరణకు నోచుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు సంబర పడుతున్నారు.
