మధ్యాహ్నం భోజనం వికటించి 44 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత
1 min read

మధ్యాహ్నం భోజనం వికటించి 44 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత

విద్యార్థుల అస్వస్థతకు మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​ లేదా మధ్యాహ్న భోజనం కారణమా ?

 

శుక్రవారం ఉదయం విద్యార్థులకు టిఫిన్​ అందజేసిన నిర్మాణ్​ ఆర్గనైజేషన్​

 

ఆరుగురు విద్యార్థులు సీరియస్​… ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు..

 

కొండాపూర్​ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది విద్యార్థులు

కొండాపూర్​ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక

మధ్యాహ్నం భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న గంటసేపటికి విద్యార్ధులు కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన వారిలో 44మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్​గా ఉండడంతో హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్ధులను కొండాపూర్​ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ సంఘటన మాదాపూర్​ ​తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.

 

విద్యార్ధులు, వారి తల్లిందండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్​ చంద్రనాయక్​తండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 140 మంది విద్యార్ధులు చదువుతున్నారు. నిర్మాణ్​ ఆర్గనైజేషన్​ సంస్థ  శుక్రవారం ఉదయం విద్యార్థులకు బ్రేక్​ఫాస్ట్​లో బోండా, ఇన్​స్టాంట్​ మ్యాగీ పెట్టారు.  మధ్యాహ్నం భోజనంలో మెనులో ఉన్న అన్నం, పప్పు, ఆటుకర్రీ, పాయపం వడ్డించారు.  మధ్యాహ్నం భోజనంలో విద్యార్ధులకు పాయసం కూడా అందించారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 3గంటల సమయంలో పాఠశాలలోని క్లాస్​రూంలో విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు చేసుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

చికిత్స పొందుతున్న విద్యార్థులు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అస్వస్థతకు గురైన 44 మంది విద్యార్ధులను అంబులెన్స్​ల్లో కొండాపూర్​ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో నానక్​రాంగూడలోని రెయిన్​బో ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం కొండాపూర్​ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా ఆసుపత్రి పిల్లల వైద్యులు డా. మహేష్​కుమార్​, డా. గాయత్రి తెలిపారు. ఇప్పటికే 16 మంది విద్యార్థులను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్​ చేసి ఇంటికి పంపించినట్లు పేర్కొన్నారు.

 

మధ్యాహ్నం భోజనం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో విద్యార్థులను కొండాపూర్​ జిల్లా ఆసుపత్రిలో డీఈఓ సుశీంధర్​రావు, డీఎంహెచ్​ఓ డా. లలితదేవి, శేరిలింగంపల్లి ఎమ్మార్వో వెంకారెడ్డి, గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్​ బాలరాజ్ పరామర్శించి, విద్యార్థుల ఆరోగ్యంపై ఆరో తీశారు. విద్యార్ధులు అందరూ ఉదయం టిఫిన్​లో తిన్న బొండా, మ్యాగీ వలన అస్వస్థతకు గురయ్యారా ? లేదా మధ్యాహ్న భోజనంలో తిన్న పాయసం వలన అస్వస్థతకు గురయ్యారా అని తెలియాల్సి ఉంది. కాగా విద్యార్ధులు కడుపునొప్పితో బాధపడుతూ, వాంతులు చేసుకొని ఆసుపత్రిలో ఉన్న ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించలేదని విద్యార్ధుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై మండిపడ్డారు. కొండాపూర్​ జిల్లా ఏరియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్ధులు అందరూ శుక్రవారం రాత్రే  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్​ అయ్యారు. రెయిన్​బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఆరుగురు విద్యార్థులు కోలుకొని రాత్రి ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లారు