చరిత్రను తిరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే
ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో తెలంగాణ ఇరిగేషన్ డే వేడుకలు..
హైడ్రా కమిషనర్‌కు ఐఈఐ తరఫున ప్రత్యేక అవార్డు..
చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి ఇంజనీర్లతో సాధ్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. చరిత్రను తరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందని, అందుకు ఆదర్శం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని పేర్కొన్నారు. సమస్య తెలుసుకోవడంతో పాటు పరిష్కారం చూపడం కూడా ముఖ్యమని తెలియజేశారు. మూసీకి వరదలు నివారణతో పాటు నగరానికి తాగునీటి సమస్య పరిష్కారానికి జంటజలశయాలను నిర్మించి హైదరాబాద్ చరిత్రలో మోక్షగుండం నిలిచిపోయారన్నారు.
శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇరిగేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీర్స్ అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ముఖ్యఅతిగా హాజరై అవార్డులను ప్రధానం చేశారు. అనంతరం ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ డ్రైనేజీ, ట్రాఫిక్, వాతావరణ మార్పులపై ఇంజనీర్లు ఖచ్చితమైన పరిష్కార మార్గాలను చూపే విధంగా కృషిచేయాలన్నారు. 2025లో కూడా పాత పద్ధతుల్లోనే సీవరేజ్, ట్రాఫిక్ వంటి సమస్యలను పరిష్కరించడం సరికాదని,
మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని శాశ్వత పరిష్కార మార్గాలను చూపించాలని అన్నారు. హైడ్రా కమిషనర్ గా పనిచేస్తూ చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఎంతో సంతోషంగా ఉందని, ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తుందని, ఇప్పుడు చేస్తున్న పనులు రాబోయే తరాలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే ఇంజనీర్లు అంతటితో ఆగిపోకుండా మారుతున్న పరిస్థితులకు అనుగునంగా ఆలోచనలకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్నారు.
చరిత్రను తిరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందని ఈ సందర్భంగా రంగనాథ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి నీటి వనరుల కోసం ఎంతో కృషిచేసిన ఇంజనీర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా జరుపుకునే 9వ తెలంగాణ ఇరిగేషన్ డే సందర్భంగా ఇంజనీర్లను అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉందని ఐఈఐ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ చేపడుతున్న పనులకు గాను ఎ.వి. రంగనాథ్‌ను ఐఈఐ తరఫున ప్రత్యేక అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఈఐ కౌన్సిల్ మెంబర్ ఎస్.సత్యనారాయణ, డాక్టర్ రంగారెడ్డి, చీఫ్ సైన్స్ట్ హెచ్.వి.ఎస్. సత్యనారాయణ, ఐఈఐ సెక్రటరి మర్రి రమేష్, ఈ వెంట్ కన్వీనర్ టి.వెంకట రత్నం తదితరులు పాల్గొన్నారు.
