అప్పులు తీర్చేందుకు చైన్‌స్నాచింగ్ అవతారం… 24 గంటల్లోనే పోలీసులకు దొరికిపోయిండు
అప్పలు తీర్చేందుకు ఓ యువకుడు చైన్ స్నాచర్‌గా మారాడు. గుడి నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడి 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎంఐజీలో చోటుచేసుకుంది. ఓల్డ్ ఎంఐజీలో నివాసం ఉండే పొట్లపల్లి సత్యవతి(72) గత నెల 31వ తేదిన ఉదయం కిలోమీటర్ దూరంలో ఉన్న రామాలయం దేవాలయానికి వెళ్లి, అక్కడ భోజనాలు చేసి తిరిగి సమయంలో ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి సత్యవతి మెడలో నుండి బంగారు పుస్తెలతాడు, నల్లపూసల దండ లాక్కొని అక్కడి నుండి పారిపోయి, ఐదు నిమిషాల వ్యవధిలోనే పక్క రోడ్డులో దేవాలయం నుండి ఇంటికి వెళ్తున్న చాగంటిపాటి జయభారతి(73) మెడలో బంగారు గొలుసు లాక్కొన్ని పరారయ్యాడు.
ఈ ఉదంతంతో ఉలిక్కిపడ్డ ఇద్దరు మహిళలు వెంటనే తమ కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న చందానగర్ పోలీసులు ఇద్దరు ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు శేరిలింగంపల్లి గోపినగర్‌కు చెందిన రాజేష్(32)గా గుర్తించి 24 గంటల వ్యవధిలోనే నిందితుడు రాజేష్‌ను అరెస్ట్ చేశారు. అప్పుల బాధ నుండి బయటపడేందుకు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బీహెచ్ ఈఎల్ లో దొంగతనం చేసిన నిందితుడు రాజేష్ కరీనంగర్ అక్కడి నుండి జగిత్యాలకు పారిపోయినట్లు గుర్తించి జగిత్యాలలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి చోరీకి గురైన 8 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో డిఐ భాస్కర్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు.
